న్యూఢిల్లీ, మే 30: నిధుల కోసం కటకటలాడుతున్న వోడాఫోన్ ఐడియాలో రూ. 20,000 కోట్ల వరకూ పెట్టుబడి చేసేందుకు అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, కొన్ని ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఫండ్స్..ఆదిత్యా బిర్లా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిధుల్ని వచ్చే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు, మూలధన వ్యయం కోసం వొడాఫోన్ఐడియా ఉపయోగిస్తుందని ఆ వర్గాలు వివరించాయి.
రూ.10,000 కోట్ల వరకూ ఈక్విటీలో పెట్టుబడి చేసేందుకు, మిగిలింది రుణాలుగా సమీకరించడానికి చర్చలు జరుగుతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో వొడాఫోన్ఐడియా షేరు 4.14 శాతం పెరిగి రూ.9.3 వద్ద ముగిసింది.