హైదరాబాద్, నవంబర్ 18: దేశంలో ప్రముఖ ఫర్నీచర్ బ్రాండ్ రాయల్ ఓక్..హైదరాబాద్‌లో మరో స్టోర్‌ను ప్రారంభించింది. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాచారంలో ఏర్పాటు చేసిన స్టోర్‌ను కంపెనీ చైర్మన్ విజయ్ సుబ్రమణ్యం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఫర్నీచర్ ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్టు, వచ్చే ఏడాదికాలంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 10 నూతన స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
ఒక్కో స్టోర్‌ను ఏర్పాటు చేయడానికి నికరంగా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నిధులు వెచ్చించనున్నట్లు, మొత్తంగా రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసేవాటిలో హైదరాబాద్‌లోనే సగం, మిగతా ఐదు ఇతర నగరాల్లో నెలకొల్పనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణతోపాటు ఏపీల్లో 38 స్టోర్లను సంస్థ నిర్వహిస్తున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 కోట్లతో 20 స్టోర్లు నెలకొల్పబోతున్నారు. ఒక్కో స్టోర్‌తో 25 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 116 స్టోర్లు ఉండగా, వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 250 స్టోర్లకు పెంచుకోనున్నట్టు తెలిపారు.
దేశీయ ఫర్నీచర్ మార్కెట్ రూ.2 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, సాలిన 10-15 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. కంపెనీ టర్నోవర్ రూ.1,000 కోట్లుగా కాగా, దీంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.250 కోట్లు సమకూరుతున్నది.