హైదరాబాద్, మే 22:దేశీయ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ మరో బైకును రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. రోర్ ఈవో పేరుతో విడుదల చేసిన ఈ మోటర్‌సైకిల్ ప్రారంభ ధర రూ.99,999గా నిర్ణయించింది. ఈ ధర కేవలం తొలి 10 వేల బుకింగ్‌లకు మాత్రమే వర్తించనున్నదని, ఆ తర్వాత ఈ బైకు ధర రూ.1,24,999కి పెంచుతున్నట్టు వెల్లడించింది. 3.4 కిలోవాట్ల ఎల్ఎఫ్పీ బ్యాటరీతో తయారైన ఈ బైకు సింగిల్ చార్జింగ్‌తో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం మూడు సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ బైకు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. కేవలం 90 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జింగ్ కానున్న బ్యాటరీపై ఎనిమిదేండ్ల వ్యారెంటీని కల్పిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్షవర్ధన్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ..ప్రస్తుతం తెలంగాణలో ఐదు షోరూంలు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటి సంఖ్య ను 25కి పెంచుకోనున్నట్టు చెప్పారు. కంపెనీ మొత్తం విక్రయాల్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉన్నదన్నారు.