బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ పుత్తడి ధర రూ.60,000 మార్కును దాటేసింది. ఆభరణాల రూపంలో కొన్నా 10 గ్రాములు రూ.55,000 పైనే పలుకుతున్నది. ఈ సమయంలో పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరులకు ఈ సాధనాలు లాభదాయకంగా కనిపిస్తున్నాయిప్పుడు. అలాంటి వాటిలో..
సావరిన్ గోల్డ్ బాండ్లు
లాభాలపై పన్ను చెల్లింపులు లేకుండా కనీస పెట్టుబడితో బంగారంలో దీర్ఘకాల మదుపునకు మీకు ఆసక్తి ఉన్నైట్టెతే సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను పరిశీలించవచ్చు. వీటిని ఏటా పరిమిత స్థాయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుర్తింపుపొందిన స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా ఎస్జీబీలను ఆర్బీఐ అమ్ముతుంది. భౌతిక బంగారం తరహాలోనే వీటిని కూడా గ్రాముల్లోనే కొలుస్తారు. డీమ్యాట్ రూపంలో ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతాయి. ఎస్‌జీబీల్లో కనీస పెట్టుబడి ఒక గ్రాము. ధరల పెరుగుదల ప్రయోజనానికితోడు ఏటా 2.5 శాతం వడ్డీరేటును కూడా ఇన్వెస్టర్లు అందుకోవచ్చు. ఇక ఎస్జీబీ పథకం కాలపరిమితి ఎనిమిదేండ్లు. అయినప్పటికీ ఐదో ఏటే నగదుగా మార్చుకునే అవకాశం ఉన్నది.
గోల్డ్ ఈటీఎఫ్‌లు
గోల్డ్ ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లావాదేవీలు దేశీయ మార్కెట్లో భౌతిక బంగారం ధర ఆధారంగా నడుస్తుంటాయి. గోల్డ్ బులియన్లలో గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబడులు పెడుతాయి. ఒక యూనిట్ అంటే ఒక గ్రాము భౌతిక బంగారంతో సమానం. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో కనీస పెట్టుబడి ఒక యూనిట్. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్
గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మైనింగ్ కంపెనీలు మొదలగున వాటిల్లో ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లు జారీచేసే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లలోనూ మదుపు చేస్తాయి. భౌతిక బంగారం విలువను ప్రతిబింబించే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ల విలువ ఆధారంగానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు జరుగుతాయి. ఇందులో పెట్టుబడికి మదుపరులకు డీమ్యాట్ ఖాతాతో పనిలేదు. చిన్నచిన్న మొత్తాలతో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మదుపు చేయవచ్చు.
డిజిటల్ గోల్డ్
ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మంట్, సేఫ్గోల్డ్ తదితర కంపెనీలు దేశీయంగా డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మొబైల్ ఈ-వ్యాలెట్లు, బ్రోకింగ్ సంస్థలు, పలు ఆర్థిక సంస్థలూ అమ్ముతున్నాయి. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్వచ్ఛత, భద్రత, బీమా రక్షణతోకూడి ఉంటుంది. మార్కెట్లో భౌతిక బంగారం ధర ఆధారంగానే వీటిపై లాభాలుంటాయి. కనిష్ఠంగా ఒక్క రూపాయితో కూడా డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అయితే ఆర్బీఐ, సెబీ వంటి రెగ్యులేటర్ల దృష్టి ఈ డిజిటల్ గోల్డ్‌పై అంతంతమాత్రంగానే ఉండటం ఈ పెట్టుబడి సాధనానికి లోపంగా చెప్పుకోవచ్చు.
చివరగా: మదుపరులు తమ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారంపై పెట్టుబడులకు 5-15 శాతం కేటాయించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.