Shamshabad Airport | హైదరాబాద్, మార్చి 3 : సరుకు రవాణాలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024లో సంస్థ 1,80,914 మెట్రిక్ టన్నుల సరుకును ఇతర దేశాలకు సరఫరా చేసింది. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో సరుకును రవాణా చేయడం ఇదే తొలిసారి. 2023లో సరుకు రవాణాతో పోలిస్తే ఇది 22 శాతం అధికమని పేర్కొంది. దీంట్లో అంతర్జాతీయ కార్గో 36 శాతం వృద్ధితో 1,08,520 టన్నులు కాగా, దేశీయంగా 3 శాతం వృద్ధితో 72,385 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వెల్లడించింది. ఎగుమతైన వాటిలో 72 శాతం ఫార్మా ఉత్పత్తులే కావడం విశేషం. గడిచిన ఏడాదికాలంలో ఇంజినీరింగ్ వస్తువులతోపాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువుల బలమైన వృద్ధిని సాధించాయి.
దేశాల పరంగా చూస్తే యూఏఈ, యూరప్ దేశాలకు 51 శాతానికి పైగా ఎగుమతి అయ్యాయి.
వీటితోపాటు అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఆస్ట్రేలియా, చైనా దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.
కార్గో మౌలిక సదుపాయలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్..ఈ అంతర్జాతీయ విమానాశ్రయ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నది. సరుకురవాణా కోసం ప్రత్యేకంగా టర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నది.
ఇక్కడి నుంచి 20 అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లకు సరుకు రవాణా అవుతున్నది.
సరుకు రవాణా కోసం ఖతార్ ఎయిర్వేస్..విమానాల సంఖ్యను పెంచుకున్నది. హైదరాబాద్-దోహా రూట్లో వారానికి మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
‘హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కార్గో కార్యకలాపాల్లో విశేషమైన వృద్ధి నమోదవుతున్నది. అంతర్జాతీయ, దేశీయ కార్గో నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటించడం వల్లనే ఇది సాధ్యమైంది. వరుసగా రెండో ఏడాది కూడా కార్గో ఎగుమతుల్లో రెండో అత్యున్నత విమానాశ్రయంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దక్కింది.