SEBI Relief | రోజురోజుకు డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులే జరుపుతున్నారు. వివిధ సంస్థల్లో, పథకాల్లో పెట్టుబడులకు డిజిటల్ చెల్లింపులే ప్రధానం అవుతున్నాయి. ఇటీవల స్టార్టప్ సంస్థలు మొదలు అతిపెద్ద కంపెనీలు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నాయి. ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టడానికి సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్ పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తున్నారు. ఐపీవోల ద్వారా ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్స్లో రిటైల్ పెట్టుబడిదారులు నిధులు పెట్టుబడి పెడుతున్నారు.
ఐపీవోలు, కన్వర్టబిలిటీల్లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకున్నది స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ. అంటే వివిధ ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు.. రూ.5 లక్షల వరకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లించవచ్చునని సెబీ మంగళవారం ఓ సర్క్యులర్లో తెలిపింది.
వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు తమ సిండికేట్ మెంబర్, స్టాక్ బ్రోకర్, షేర్ ట్రాన్స్ఫర్ ఏజంట్, రిజిస్ట్రార్లకు అందజేసే ఐపీవో బిడ్ కం అప్లికేషన్లో వారి యూపీఐ=ఐడీ వివరాలు ఇవ్వాలని సెబీ తెలిపింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీవోలకు నూతన గైడ్లైన్స్ అమల్లోకి వస్తాయని వెల్లడించింది. గత డిసెంబర్లోనే ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టే వారు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్ణయం తీసుకున్నది.