Retail Inflation | రిటైల్ ద్రవ్యోల్బణం అందరి అంచనాలను తోసి రాజంటూ మళ్లీ కొండెక్కింది. డిసెంబర్లో 5.72 శాతం చిల్లర ద్రవ్యోల్బణం నమోదు కాగా, గత నెలలో 6.52 శాతానికి దూసుకెళ్లింది. వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకోవడానికి ఆర్బీఐ గరిష్ట పరిమితి ఆరు శాతానికి పైగా చిల్లర ద్రవ్యోల్బణం నమోదు కావడం మూడు నెలల్లో ఇదే తొలిసారి.
ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ఆహార ద్రవ్యోల్బణం 5.94 శాతానికి దూసుకెళ్లిందని, అందువల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. చిల్లర ద్రవ్యోల్బణంలో ఆహార పదార్థాలు దాదాపు 40 శాతం వాటా కలిగి ఉంటాయి.
డిసెంబర్లో 4.19 శాతంగా నమోదైన ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 5.94 శాతానికి దూసుకెళ్లింది. అయితే కూరగాయల ధరలు గత డిసెంబర్లో 11.70 శాతం నమోదు కాగా, గత నెలలో 15.08 శాతానికి పరిమితం అయ్యాయి. ఆయిల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 10.97 నుంచి 10.84 శాతానికి పడిపోయింది. తృణ ధాన్యాల ధరలు 13.79 శాతం నుంచి 16.12 శాతానికి పెరిగాయి.
రిటైల్ ద్రవ్యోల్బణంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సాక్షి గుప్తా స్పందించారు. `కీలక ద్రవ్యోల్బణం సంక్లిష్టంగా ఉంది. దీనికితోడు గోధుమలతోపాటు ప్రోటీన్ ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్లే జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం శరవేగంగా 6.52 శాతానికి పెరిగింది. అంతకుముందు రెండు నెలలు (నవంబర్, డిసెంబర్) ద్రవ్యోల్బణం స్వల్పంగా దిగి వచ్చినా.. అది విస్తృత ప్రాతిపదికన కాదని తేలింది. కీలక ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందంటూ గతవారం 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్‌ను ఆర్బీఐ పెంచేసింది. తాజా పరిణామాలు మరో దఫా ఏప్రిల్‌లో వడ్డీరేట్ల పెంపు తప్పక పోవచ్చు. బాండ్ల ధరలు 7.4 శాతాన్ని దాటొచ్చు` అని అభిప్రాయ పడ్డారు.