Retail Inflation | అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త రిలీఫ్ ఇచ్చింది. అక్టోబర్లో 6.21 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం.. నవంబర్ నెలలో 5.48 శాతానికి దిగి వచ్చింది. ఆహార వస్తువులు, ప్రధానంగా కూరగాయల ధరలు తగ్గడం వల్లే నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) పేర్కొంది.
అక్టోబర్ నెలలో ఉన్న 10.87 శాతంగా ఆహార ద్రవ్యోల్బణం.. నవంబర్లో 9.04 శాతానికి దిగి వచ్చింది. గతేడాది నవంబర్ నెలలో 8.70 శాతంగా ఆహార ద్రవ్యోల్బణం నమోదైంది. కూరగాయలు, పప్పులు- పప్పు అనుబంధ ఉత్పత్తులు, చక్కెర, ఫలాలు, కోడిగుడ్లు, పాలు-పాల ఉత్పత్తులు, మసాలా దినుసులు, కమ్యూనికేషన్స్, రవాణా, పర్సనల్ కేర్ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని ఎన్ఎస్ఓ తెలిపింది.
గత జూలై-ఆగస్టుల్లో 3.6 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. సెప్టెంబర్ నెలలో 5.5, అక్టోబర్ కల్లా 6.2 శాతానికి చేరుకున్నది. గతేడాది సెప్టెంబర్ ద్రవ్యోల్బణం కంటే 2024 అక్టోబర్ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.8 నుంచి 4.5 శాతానికి తగ్గుతుందని గత వారం ఆర్బీఐ అంచనా వేసింది. అయితే డిసెంబర్ త్రైమాసికంలో ఆహార వస్తువుల ధరలు పెరగకుండా ఉండాలంటే ఆహార వస్తువులపై ధరల ఒత్తిళ్లను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.