హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ సిక్స్యునైటెడ్… హైదరాబాద్ కేంద్రంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారుచేస్తున్న రిసొల్యుట్ గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సిక్స్యునైటెడ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ల్యాప్టాప్లు, పీసీలను తయారు చేయడానికి ప్రత్యేకంగా ప్లాంట్ను నెలకొల్పబోతున్నది.
తైవాన్ రాజధాని తైఫీలో జరుగుతున్న ప్రపంచస్థాయి ట్రేడ్ షో ‘కంప్యూటెక్స్’లో భాగంగా గురువారం రాష్ట్ర ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈవో నరసింహారెడ్డి సమక్షంలో రిసొల్యుట్ గ్రూప్ ఛైర్మన్ రమీందర్ సింగ్, సిక్స్యునైటెడ్ సీఈవో మైఖేల్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి ఈ ఒప్పందం తోడ్పడుతుందని, హై-టెక్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తున్నదని రిసొల్యుట్ వర్గాలు తెలిపాయి.