RBI | ముంబై, జనవరి 17: బ్యాంక్ ఖాతాలతోపాటు డిపాజిట్ ఖాతాలు, లాకర్లు ఇక నుంచి కచ్చితంగా నామినీలు తప్పనిసరి చేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ తాజాగా ఆదేశించింది. దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో బ్యాంక్ ఖాతాలకు నామినీలు లేరని, వెంటనే పాత, కొత్త ఖాతాలకు కచ్చితంగా నామినీ ఉండాల్సిందేనని శుక్రవారం ఆదేశించింది. డిపాజిటర్ మరణించిన వారి కుటుంబీలకు ఆయా డిపాజిట్లను సమర్పించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేరని సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. మరోవైపు, బ్యాంక్ ఖాతాకు సంబంధించి లావాదేవీలకోసం ‘1600ఎక్స్ఎక్స్’ ఫోన్ నంబర్‌ను వినియోగించుకోవాలని బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ సూచించింది. ఆర్థిక మోసాలను నియంత్రించడానికి ఈ సరికొత్త నంబర్‌ను ప్రవేశపెట్టింది ఆర్బీఐ. అలాగే ప్రమోషనల్ కోసం బ్యాంకులు, ఇతర రెగ్యులేటెడ్ సంస్థలు 140ఎక్స్ఎక్స్ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించింది.