సీడ్ ఫండ్ కింద మంజూరు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) సంస్థ అర్హత కలిగిన స్టార్టప్‌లనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఫుడ్ అండ్ అగ్రి కల్చర్, లైఫ్ సైన్సెస్, సస్టెయినబిలిటీ, క్లీన్ టెక్, ఈ-మొబిలిటీ, ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్ అంశాల్లో స్టార్టప్‌లను నిర్వహిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు రూ.20 లక్షలను, రూ.50 లక్షలను మార్కెట్ విస్తరణ, వ్యాపార కార్యకలాపాల విస్తరణలకు అవసరమైన స్టార్టప్‌లకు గ్రాంట్ రూపంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం కింద మంజూరు చేయనున్నారు. మరిన్ని వివరాలకు (https://rich. telangana.gov.in)లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణలో స్టార్టప్ విప్లవం: జయేశ్
స్టార్టప్ విప్లవంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో వీఎల్ఎస్ఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే టెక్నాలజీ, వీఎల్ఎస్ఐ విభాగాల్లో స్టార్టప్‌లకు, ఇన్నోవేషన్‌కు అపార అవకాశాల్ని రాష్ట్రం కల్పించిందని తెలిపారు. ప్రముఖ సెమికండక్టర్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తున్నాయన్నారు. వేలాది ట్రాన్సిస్టర్స్‌ను సింగిల్ సెమికండక్టర్ మైక్రోచిప్‌లో అమర్చడం ద్వారా ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ను సృష్టించే ప్రక్రియనే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ)గా వ్యవహరిస్తారు. ఇదిలావుంటే ఇన్ఫరేషన్ టెక్నాలజీ సర్వర్లు, ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టనుంది.