TGRERA | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడాఝులిపించింది. మార్కెటింగ్ కార్యకలాపాలు, ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న మోసాలపై ఉక్కుపాదం మోపడానికి రెరా పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. పూర్తిస్థాయిలో రెరా ఏర్పాటైన గడిచిన ఏడేండ్లలో ఏకంగా వెయ్యికి పైగా ప్రాజెక్టులపై రూ.36 కోట్ల వరకు జరిమానా విధించింది. వీటిలో ఇప్పటికే రూ.15 కోట్లను ఆయా సంస్థలు చెల్లించాయి కూడా.
ఎనిమిది కంటే ఎక్కువ ప్లాట్లను విక్రయించిన, 600 గజాలు అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించి విక్రయాలు చేసినా ప్రాజెక్టులు రెరా పరిధిలోకి వస్తాయి. ఇలాంటి సంస్థలు తప్పకుండా రెరా వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెరా వద్ద నమోదు చేసుకోకుండానే విక్రయాలు జరిపితే ఆయా ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలపై ఈ మండలి భారీస్థాయిలో జరిమానా విధిస్తున్నది.
రెరా నంబర్ లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు జారీ చేసిన సంస్థలపై ఫిర్యాదులు అందడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాణిజ్య ప్రకటనలపై ఖచ్చితంగా రెరా నంబర్ ఉండాల్సిందేనని షరతు విధించింది. దీంతో తమ ప్రకటనల పక్కన రెరా నంబర్‌ను ఖచ్చితంగా ముద్రిస్తున్నాయి.
ప్రీలాంచ్ ఆఫర్లు, ముందస్తుగా ఒప్పందం చేసుకున్న మేరకు ప్లాట్లను అప్పగించకపోవడం, వాటిలో సరైన వసతులు కల్పించకపోయిన ప్రాజెక్టులపై కూడా చర్యలు తీసుకున్నది. ఒక దగ్గర ప్రాజెక్టు నమోదు చేసుకొని..అదే అనుమతితో మరికొన్ని చోట్ల విక్రయాలు చేస్తున్న ప్రాజెక్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.