హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సామాజిక, వృత్తి వ్యాపార పరమైన మానవ సంబంధాలను పునరుద్ధరించడంలో మధ్యవర్తిత్వంతో కూడిన రాజీమార్గం ఎంతో దోహదపడుతుందని ‘రెరా’ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చైర్మన్ ఎన్ సత్యనారాయణ అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్(ఐఏఎంసీ) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన ‘మధ్యవర్తిత్వం-రాజీమార్గం’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ గణాంకాల ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు తాము కష్టపడి సంపాదించిన సొమ్ములో 71 శాతం పొదు పు చేస్తున్నారని, ఈ కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీ తనం తప్పనిసరని స్పష్టంచేశారు. వ్యవసాయ రంగం తర్వాత దేశీయ వృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని, ఆర్థిక, ఉపాధి కల్పన పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రెరా అధికారులతోపాటు నారెడ్కో, క్రెడాయ్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎంపికైన ప్యానల్ సభ్యులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు హాజరయ్యారు.