CBDT on HRA | కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులు, సిబ్బందికి, కార్మికులకు ఇంటి వసతి కల్పిస్తుంటాయి. ఉద్యోగి లేదా కార్మికుడికి మేనేజ్మెంట్.. ఇల్లు, ఫ్లాట్, ఫామ్ హౌస్, హోటల్ లేదా మోటర్, సర్వీస్ అపార్ట్మెంట్.. ఇలా ఏదో ఒక రూపంలో ఇంటి వసతి కల్పిస్తే.. సంబంధిత ఉద్యోగి లేదా కార్మికుడు తన ఇంటికి తీసుకెళ్లే శాలరీ ఎక్కువే ఉంటుంది. అలా ఎక్కువ తీసుకువెళ్లే శాలరీ.. ఇన్‌కం టాక్స్ శ్లాబ్ దాటితే.. ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతియేటా వేతన జీవులు సమర్పించే ఐటీ రిటర్న్స్‌లో హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) మినహాయింపు క్లయిమ్ చేస్తుంటారు. కానీ, సంస్థ మేనేజ్మెంట్ ఇంటి వసతి వినియోగించుకుంటున్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రం ఇక నుంచి హెచ్ఆర్ఏ క్లయిమ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి యాజమాన్యాలు కల్పించిన వసతి ఇంట్లో జీవిస్తున్న వారికి హెచ్ఆర్ఏ క్లయిమ్ వర్తించదు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త నిబంధన తీసుకు వచ్చింది. ఇలా యాజమాన్యాలు కల్పించిన ఇంటి వసతిలో జీవించే వారి వేతనం.. ఆదాయం పన్ను చట్టం శ్లాబ్ దాటితే.. వారి వేతనం నుంచి ఆదాయం పన్ను విభాగం టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది.
ఆయా కంపెనీల మేనేజ్మెంట్లు కల్పించే ఇంట్లో గల వసతులను బట్టి హెచ్ఆర్ఏ ఖరారు చేస్తారు. 2011 జనగణన ప్రకారం 40 లక్షల పై చిలుకు జనాభా గల నగరాల పరిధిలో 10 శాతం వేతనం, 40 లక్షల్లోపు జనాభా గల నగరాల్లో 7.5 శాతం, ఇతర పట్టణాల పరిధిలో ఐదు శాతం వేతనాన్ని హెచ్ఆర్ఏగా పరిగణిస్తారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు హోటల్ వసతి కల్పించినప్పుడు .. సంబంధిత ఉద్యోగి వేతనంలో 24 శాతం లేదా రియల్ చార్జేస్ ప్రకారం ఇంటి వసతి విలువ గణిస్తారు. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు వాడితే 10 శాతం చార్జీ కింద మినహాయిస్తున్నారు.
అధికారిక విధుల నిర్వహణ కోసం యాజమాన్యం తమ సిబ్బందికి వసతి కల్పిస్తే ఆదాయం పన్ను వర్తించదని ఆర్థిక రంగ నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. అయితే గత నెల వరకూ పాతన నిబంధనే అమలులో ఉంటుంది. ఒకవేళ ఏడాదికి పైగా యాజమాన్యం కల్పించే ఇంటి వసతికి ద్రవ్యోల్బణం ఆధారిత పరిమితి వర్తింప చేస్తారు. యాజమాన్యం కల్పించిన ఇంటి వసతి, అందులో సౌకర్యాల ఆధారంగా తన ఉద్యోగి లేదా కార్మికుడి వేతనం.. దాని శ్లాబ్ పరిధి ఆధారంగా మేనేజ్మెంట్ టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది.