Reliance on Metro | గ్రాసరీ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ చకచకా పావులు కదుపుతోంది. భారత్‌లో జర్మనీకి చెందిన మెట్రో ఆపరేషన్స్‌ను పూర్తిగా టేకోవర్ చేసేందుకు చేపట్టిన చర్చలు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకోవచ్చునని ఈ చర్చలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. దీని విలువ 100-102 కోట్ల డాలర్లు ఉండొచ్చునని అంచనా. ఇందులో మెట్రో సంస్థ రుణ బకాయిలు కూడా ఉన్నాయని వినికిడి.
రిలయన్స్ సంస్థతోపాటు చారోన్ పోక్ ఫాండ్ గ్రూప్ (సీపీ గ్రూప్) పోటీ పడినట్లు సమాచారం. కానీ సీపీ గ్రూప్.. బిడ్డింగ్ నుంచి వైదొలిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మాల్స్ మార్కెట్ విలువపై మెట్రో, రిలయన్స్ ప్రతినిధుల మధ్య చర్చలు సాగుతున్నాయని తెలుస్తున్నది. అయితే, దీనిపై స్పందించేందుకు మెట్రో, రిలయన్స్ ప్రతినిధులు నిరాకరించారు. సీపీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు.
భారత్ మార్కెట్లోకి మెట్రో 2003లో ఎంటరైంది. దేశవ్యాప్తంగా 31 హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు నిర్వహిస్తున్నది. బిజినెస్ కస్టమర్లకు మాత్రమే మెట్రోస్ సేవలందిస్తున్నది. మెట్రో మాల్స్‌కు హోటల్స్, రెస్టారెంట్స్, వివిధ రకాల కార్పొరేట్లుగా ఉన్న స్మాల్ రిటైల్ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పటికే దేశీయ రిటైల్ మార్కెట్‌పై గట్టి పునాదులు ఏర్పాటు చేసుకున్న రిలయన్స్.. మెట్రోను టేకోవర్ చేస్తే మరింత బలోపేతం అవుతుందని సమాచారం. మెట్రో సంస్థను టేకోవర్ చేసే విషయమై రిలయన్స్ ప్రత్యర్థి సంస్థ అమెజాన్ ఆసక్తిగా ఉందని గత జూలైలోనే బ్లూంబర్గ్ న్యూస్ పేర్కొంది.