Reliance Jio | దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. 8వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం తమ కస్టమర్లకు పలు రిచార్జ్ ప్లాన్లపై ఆఫర్లను ప్రకటించింది. జియో.కామ్ వెబ్సైట్ వివరాల ప్రకారం ఈ నెల 5 నుంచి 10వ తేదీ మధ్య ఎవరైతే 3 నెలల ప్లాన్లు, ఏడాది ప్లాన్‌ను రిచార్జ్ చేసుకుంటారో వారికి రూ.700 విలువైన 3 ప్రయోజనాలను అందిస్తున్నట్టు తెలిపింది.
వీటిలో 10 ఓటీటీలు, రూ.175 విలువైన 28 రోజుల వ్యాలిడిటీగల 10జీబీ డాటా ప్యాక్, ఉచిత జొమాటో 3 నెలల గోల్డ్ మెంబర్షిప్ ఉన్నాయి. కాగా, రూ.899, రూ.999లతో ఉన్న త్రైమాసిక ప్లాన్లు.. రూ.3,599తో ఉన్న వార్షిక ప్లాన్లకే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. త్రైమాసిక ప్లాన్లలో కస్టమర్లకు రోజూ 2జీబీ డాటా ఉంటుంది. ఇక రూ.899 ప్లాన్ గడువు 90 రోజులైతే.. రూ.999 ప్లాన్ కాలవ్యవధి 98 రోజులు.
అలాగే రూ.3,599 ప్లాన్ గడువు 365 రోజులు. రోజూ 2.5జీబీ డాటాను వాడుకోవచ్చు. 2016 సెప్టెంబర్‌లో ఉచిత వాయిస్ కాల్స్, చౌక ధరలకే ఇంటర్నెట్ సేవలతో భారతీయ టెలికం రంగంలోకి జియో సంచలనాత్మక ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. 2జీ, 3జీలను పక్కనబెట్టి 4జీతో పరిచయమైంది. ఈ క్రమంలోనే కేవలం 170 రోజుల్లోనే 10 కోట్ల కస్టమర్ల మార్కును జియో తాకింది.
అంతేగాక జియోఫోన్ (ఇంటిలిజెంట్ స్మార్ట్‌ఫోన్), జియోభారత్ (అల్ట్రా-అఫర్డబుల్ 4జీ ఫోన్), జియో ఫైబర్, ఎయిర్‌ఫైబర్ (ఫిక్స్డ్ వైర్లెస్ బ్రాడ్‌బాండ్ ఆఫర్), పూర్తిస్థాయిలో 5జీ సర్వీసులనూ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలి వార్షిక వాటాదారుల సమావేశంలో జియో యూజర్ల కోసం 100జీబీదాకా ఉచిత క్లౌడ్ స్టోరేజీని కూడా ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే. ఏఐ సాంకేతికతతో వివిధ ఫీచర్లను కస్టమర్లకు అందిస్తున్నట్టూ పేర్కొన్నారు.