Reliance | భారత బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆదాయం.. లాభాలు.. ఆ సంస్థకు ఉన్న మార్కెట్ విలువ గురించి తెలియిన వారుండరు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ. పెట్రోలియం ఉత్పత్తుల శుద్ధి మొదలు టెలికం.. రిటైల్.. సహా పలు రంగాల్లో సేవలందిస్తున్న సంస్థ రిలయన్స్ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఈ ఏడాది కాలంలో న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిందని వీజీకీ (Wizikey) నివేదిక పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ కంపెనీల కంటే ఎక్కువగా వార్తల్లో రిలయన్స్ నిలిచిందని తెలిపింది.
గత ఐదేండ్లుగా దేశీయ కార్పొరేట్ సంస్థల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. వీజీకే నివేదికలో రిలయన్స్‌కు 97.43 శాతం మార్కులు వచ్చాయి. మీడియాలో ఉన్న నాలుగు లక్షలకు పైగా కంపెనీలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా ఆధారంగా న్యూస్ స్కోరింగ్ నిర్ధారించారు. తర్వాతీ స్థానాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, జొమాటో, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐటీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్ ఉన్నాయని వీజీకే వివరించింది.