న్యూఢిల్లీ : యువ టెకీలకు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తీపికబురు అందించింది. ఎంట్రీ-లెవెల్ రిక్రూట్మెంట్ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రాంను చేపట్టింది. చిన్న పట్టణాలు, ప్రాంతీయ సంస్ధల నుంచి వచ్చే యువ ఇంజనీర్లకు ప్రపంచ శ్రేణి శిక్షణ, ఉపాధి కల్పిస్తూ అందరికీ అవకాశాలను కల్పించేలా గెట్ 2024కు ఆర్ఐఎల్ డిజైన్ చేసింది. రిలయన్స్ తొలిసారిగా అప్లికేషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌కు మార్చి దేశవ్యాప్తంగా ప్రతి యువ ఇంజనీరింగ్ విద్యార్ధికి సమాన అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది.
భారత్‌లో నిజమైన నైపుణ్యాలు చిన్న పట్టణాలు, రీజినల్ ఇనిస్టిట్యూట్స్‌లో ఉన్నాయని ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అద్దం పడుతూ ఆర్ఐఎల్ ఈ దిశగా యువ ఇంజనీర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే దిశగా కసరత్తు సాగిస్తోంది. గెట్ 2024 ప్రోగ్రాం 2024 బ్యాచ్‌కు చెందిన కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆర్ఐఎల్ అభ్యర్ధులకు మెరుగైన శిక్షణ, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. జనవరి 11 నుంచి 19 వరకూ రిజిస్ట్రేషన్ జరగనుండగా, ఫిబ్రవరి 5 నుంచి 8 వరకూ ఆన్లైన్ అసెస్మెంట్, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకూ వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. మార్చి నెలాఖరున తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ప్రోగ్రాంలో ఎంపికైన అభ్యర్ధులను మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఎక్ల్సోరేషన్, ప్రొడక్షన్, రిలయన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్, పెట్రోకెమికల్స్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టింగ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ సహా పలు విభాగాల్లో రిక్రూట్ చేసుకుంటుంది.
Read More :