‘ప్రభుత్వాలు ముందుగా ప్రజల ఆదాయం పెంచాలి.. ఆ తర్వాతే ఖజానా నిండటం గురించి ఆలోచించాలి’.. పరిపాలన గురించి ఆర్థిక శాస్త్రవేత్తలు తరచూ చెప్పే మాట ఇది. తెలంగాణ ప్రభుత్వం దీనిని వందశాతం అమలుచేసింది. రాష్ర్టావిర్భావం తర్వాత అన్నిరంగాల్లో దీర్ఘకాల ప్రణాళికలు అమలుచేసి సంపదను సృష్టించింది. ప్రజల ఆదాయాన్ని పెంచింది. ముఖ్యంగా రాష్ట్రంలో హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లో రియల్‌బూమ్ బాగా పెరిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నెలనెలా వెయ్యి కోట్లకు పైగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నది.
2019-207,061
2020-215,260
2021-226,250 మొదటి 9 నెలలు
హైదరాబాద్, నవంబర్ 24, (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుంది. ఇతర ఆదాయ వనరులు కూడా తగ్గిపోయి రాష్ట్రం మనుగడ కష్టమౌతుంది’.. ఇదీ తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదుల నుంచి బలంగా వినిపించిన వాదన. వీరికి కొంతమంది తెలంగాణ నేతలూ వంతపాడారు. వారందరి కండ్లు బైర్లు కమ్మేలా, నోర్లు మూతపడేలా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకపోతున్నది. ప్రస్తుతం ఈ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచింది. ఢిల్లీ, చెన్నై , కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ కంటే హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర ఎక్కువ. గతేడాది కరోనా కాలంలో దేశవ్యాప్తంగా రియల్ రంగం కుదేలైనా తెలంగాణలో మాత్రం ఆ ప్రభావం నామమాత్రమే. ఎలాంటి పరిస్థితుల్లోనూ తొణకక, బెణకక స్థిరాస్తి క్రయవిక్రయాల హోరు అప్రతిహతంగా దూసుకుపోతున్నది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్నది.
రిజిస్ట్రేషన్ల ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరం రికార్డును ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలలకే అధిగమించింది. మరో పదిహేను రోజుల్లో తెలంగాణ రా్రష్ట్రం ఏర్పాటు తర్వాత ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టబోతున్నది. 2020-21లో రిజిస్ట్రేషన్లపై రూ.5,260 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరంలో ఇప్పటికే రూ.6,600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరో 15 రోజుల్లో రూ.7,000 కోట్లు దాటుతుందని అధికారులు అంచన వేస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 2019-20లో అత్యధికంగా రూ.7061 కోట్లు ఆర్జించింది. ఇప్పుడు ఈ రికార్డులను కూడా బద్దలుకొట్టబోతున్నది. స్టాంపులు అండ్ రిజిస్రేష్టన్ల శాఖ గత ఐదు నెలల నుంచి వెయ్యి కోట్లకు తగ్గకుండా ఆర్జించడం అనూహ్యమని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గత జూలై ఒక్క నెలలోనే రూ.1,200 కోట్ల రాబడితో రికార్డు సృష్టించినట్టు వెల్లడించారు.