Home Sales | తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో సొంతిండ్లకు గిరాకీ పెరుగుతోంది. అందుకే 2023తో పోలిస్తే గతేడాది ఇండ్ల విక్రయాలు ఏడు శాతం వృద్ధి చెందాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. 2023లో 71,912 ఇండ్ల అమ్మకాలు జరిగితే, 2024లో ఏడు శాతం పెరిగి 76,613 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం ఇండ్ల విక్రయాల విలువ 23శాతం పెరిగింది. 2023లో 38,395 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో 47,173 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం ఇండ్ల విక్రయాల్లో 90 శాతం రెసిడెన్షియల్ సెగ్మెంట్‌దే ఆధిపత్యం. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు హైదరాబాద్ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఇండ్ల విక్రయ లావాదేవీలు జత కలిసి ఉన్నాయి.
గత ఏడాది కాలంలో హైదరాబాద్ మార్కెట్ ప్రగతి దిశగా అడుగులేస్తున్నది. సొంతిండ్లకు డిమాండ్ సుస్థిరంగా కొనసాగుతున్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ చెప్పారు. అంతే కాదు.. ఇండ్ల కొనుగోలు దారుల ప్రాధాన్యాల్లోనూ చెప్పుకోదగిన మార్పు కనిపిస్తోంది. రూ.50 లక్షల్లోపు ధర గల ఇండ్ల విక్రయాలు 60శాతం ఉంటే, 2023లో అది 68 శాతంగా ఉంది. ఇక రూ.50 లక్షల పై చిలుకు ధర గల ఇండ్ల రిజిస్ట్రేషన్లు 2023తో పోలిస్తే 2024లో 40 శాతానికి వృద్ధి చెందాయి. 2022తో పోలిస్తే 2023లో రూ.50 లక్షలపై చిలుకు ఇండ్ల విక్రయాలు 32శాతం పుంజుకున్నాయి. బలమైన ఆర్థిక మూలాలు, ప్రీమియం, లగ్జరీ జీవనానికి హైదరాబాదీలు ప్రాధాన్యం ఇస్తున్నారని శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు సైతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త వెంచర్లు, ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చురుగ్గా స్పందిస్తున్నారన్నారు.
‘హైదరాబాద్‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్లు వృద్ధి చెందడం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లస్ ఉద్యోగ అవకాశాలకు హబ్‌గా నిలుస్తుందని సంకేతం. సానుకూల విధాన వాతావరణంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి విదేశీ, దేశీయ పెట్టుబడులు పెరుగుతున్నాయి’అని సుమధుర గ్రూప్ సీఎండీ జీ మధుసూధన్ చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు చురుకైన చర్యలు తీసుకోవడం, శరవేగంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ ఎకోసిస్టమ్ విస్తరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొన్ని నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం విధాన నిర్ణయాలు తీసుకోవడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయన్నారు.