తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్లపాటు అత్యధిక డిమాండ్‌ను చూసిన హైదరాబాద్ రియల్టీకి ఇప్పుడు ఆదరణే కరువైపోయింది.అటు హౌజింగ్ మార్కెట్, ఇటు ఆఫీస్ మార్కెట్ రెండూ కుప్పకూలుతున్నాయి మరి. ఎన్నో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీలు విడుదల చేస్తున్న వరుస నివేదికలే ఇందుకు నిదర్శనం.
తాజాగా దేశీయ రియల్టీపై అందులో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ తీరుతెన్నులపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ రిపోర్టునిచ్చింది. ఇందులో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ సైప్లె, లీజింగ్ 25 శాతం పడిపోయినట్టు తేలింది.
న్యూఢిల్లీ, నవంబర్ 19: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరుగులకు బ్రేక్ పడిందా?.. సుమారు దశాబ్దకాలం కనిపించిన డిమాండ్ ఇప్పుడు కనుమరుగైపోతున్నదా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కన్సల్టెన్సీ ఏదైనా.. చెప్పేది మాత్రం ఒక్కటే. అదే.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో నిస్తేజం ఆవరిస్తున్నదని. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన తాజా నివేదిక సైతం ఇదే చెప్తున్నది. మంగళవారం వచ్చిన ఈ రిపోర్టు.. హైదరాబాద్‌లోని ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ అంతంతమాత్రంగానే ఉన్నట్టు తేల్చింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మార్కెట్లోకి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్ స్పేస్ గతంతో చూస్తే 25 శాతం తగ్గినట్టు పేర్కొన్నది. 4.1 మిలియన్ చదరపు అడుగులకే పరిమితమైనట్టు స్పష్టం చేసింది. అలాగే ఇదే సమయంలో లీజింగ్ కార్యకలాపాలు సైతం 25 శాతం క్షీణించి 2.79 మిలియన్ చదరపు అడుగుల వద్దే ఉన్నట్టు వెల్లడైంది.
రివర్స్ గేర్‌లో..
దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందు గుర్తొచ్చేదే హైదరాబాద్. ఒకప్పుడు బెంగళూరు, ముంబైలకు ఈ ఘనత దక్కినా.. తెలంగాణ రాష్టం ఏర్పాటుతో సుమారు పదేండ్లపాటు అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారంతో ఆ నగరాల స్థానంలోకి హైదరాబాద్ వచ్చి చేరింది. ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు, ఫార్మా, బయోసైన్స్, ఏవియేషన్, డాటా సెంటర్లు ఇలా అన్నింటికీ హైదరాబాదే ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం సన్నగిల్లింది. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆఫీస్ స్పేస్ సైప్లె కూడా అందుకు తగ్గట్టుగానే తగ్గుతూ వస్తున్నది. దీనిపై రియల్టీ వర్గాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఢిల్లీ, బెంగళూరుల్లో..
ఓ వైపు హైదరాబాద్‌లో కొత్తగా వచ్చే ఆఫీస్ స్పేస్ క్షీణిస్తుంటే.. మరోవైపు బెంగళూరు, ఢిల్లీల్లో అది పెరుగుతూపోవడం గమనార్హం. ఈ జూలై-సెప్టెంబర్‌లో బెంగళూరులో అందుబాటులోకి వచ్చిన నూతన ఆఫీస్ స్పేస్ 3.6 మిలియన్ చదరపు అడుగులు. గతంతో పోల్చితే 33 శాతం ఎక్కువ. అలాగే ఢిల్లీ-ఎన్సీఆర్లోనూ 2.3 మిలియన్ చదరపు అడుగులకు ఎగిసింది. మునుపటితో చూస్తే ఇది ఏకంగా 360 శాతం పెరగడం విశేషం. ముంబైలో 0.90 మిలియన్ చదరపు అడుగులతో యథాతథంగా కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా ఉన్నది. చెన్నైలో స్వల్పంగా తగ్గగా, కోల్‌కతాలో ఏ-గ్రేడ్ ఆఫీస్ స్పేస్ సైప్లెనే లేదని వెస్టియన్ చెప్పింది. పుణెలో మాత్రం 26 శాతం తరుగుదల కనిపించింది. దీంతో హైదరాబాద్‌సహా దేశంలోని ఈ ఏడు ప్రధాన నగరాల్లో ఓవరాల్‌గా మార్కెట్లోకి కొత్త ఆఫీస్ స్పేస్ రాక 4 శాతం పడిపోయి జూలై-సెప్టెంబర్‌లో 12.8 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు వెస్టియన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
లీజింగ్‌లో..
ఈ జూలై-సెప్టెంబర్‌లో బెంగళూరులో లీజింగ్ కార్యకలాపాలు 84 శాతం ఎగిసి 6.63 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. పుణెలో 112 శాతం పెరిగి 2.33 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. చెన్నైలో లీజింగ్ కార్యకలాపాలు యథాతథంగానే ఉండగా, ముంబైలో స్వల్ప క్షీణత కనిపించింది. ఢిలీ-ఎన్సీఆర్లో 17 శాతం, కోల్‌కతాలో 45 శాతం తగ్గాయి. ఇక బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో డిమాండ్ ఉన్నట్టు వెస్టియన్ చెప్తున్నది.