న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశీయంగా ఇంధన ఉత్పత్తి తగ్గింది. జూలై నెలకుగాను 3.8 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఓఎన్జీసీతోపాటు ప్రైవేట్ సంస్థలు 2.45 మిలియన్ టన్నుల పెట్రోల్, డీజిల్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.
అంతక్రితం ఏడాది ఇదే నెలలో 2.54 మిలియన్ టన్నులుగా ఉన్నది. జూన్‌లో ఉత్పత్తి అయిన 2.59 మిలియన్ టన్నులతో పోలిస్తే కూడా భారీగా తగ్గింది. ఓఎన్జీసీ ఉత్పత్తి 1.7 శాతం తగ్గి 1.63 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇతర ప్రైవేట్ సంస్థల ప్రొడక్షన్ 12 శాతానికి పైగా తగ్గింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో చమురు ప్రొడక్షన్ 9.96 మిలియన్ టన్నుల నుంచి 9.91 మిలియన్ టన్నులకు పడిపోయాయి.