Economic Crisis | న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయంగా డీజిల్‌కు డిమాండ్ పెద్ద గా పెరిగిన దాఖలాలు లేవు. దేశ ఆర్థిక కార్యకలాపాల అంచనా సూచికల్లో ఒకటిగా ఉన్న డీజిల్ వినియోగం వృద్ధి.. ఏకంగా నాలుగేండ్ల కనిష్ఠానికి క్షీణించడం గమనార్హం. 2020-21 తర్వాత గడిచిన ఏడాది కాలమే డీజిల్ వినియోగం కేవలం 2 శాతం పెరిగి 91.4 మిలియన్ టన్నులకు పరిమితమైనట్టు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) తాజాగా తెలియజేసింది. ఇది 2023-24తో పోల్చితే 4.3 శాతం, 2022-23తో చూస్తే 12.1 శాతం తక్కువ కావడం మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నదిప్పుడు.
ఇదీ సంగతి..
దేశీయంగా చమురు వినియోగంలో డీజిల్ వాటా దాదాపు 40 శాతం. భారీ ట్రక్కులు, లారీలు.. పెద్ద పెద్ద యంత్రాలు నడిచేది ఇప్పటికీ డీజిల్‌తోనే. దీంతో డీజిల్ వినియోగంలో స్వల్ప పెరుగుదల.. దేశంలో దిగజారుతున్న తయారీ, పడిపోతున్న రవాణా కార్యకలాపాలకు నిదర్శనంగా నిలుస్తున్నదని మెజారిటీ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజానికి విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) వినియోగం భారత్‌లో ఏటేటా పెరుగుతూపోతున్నది. కానీ ఈవీలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, కార్ల విభాగానికే పరిమితమవుతున్నాయి. దీనికి తగ్గట్టు ఇప్పటికీ దేశంలో వస్తూత్పత్తులు, ఇతరత్రా రవాణాకు చిన్నవైనా.. పెద్దవైనా నాలుగింటా మూడొంతులు ఇంకా డీజిల్ ఆధారిత వాహనాలనే వాడుతున్నామని పరిశ్రమ వర్గాలు సైతం చెప్తున్నాయి. సాధారణంగా పెరుగుతున్న జనాభా, దానికి అనుగుణంగా విస్తరిస్తున్న మార్కెట్ అవసరాల దృష్ట్యా డీజిల్ వాడకం కూడా పెరగాలి. అయితే ఇందుకు భిన్నంగా వాస్తవ గణాంకాలుండటం.. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి సంకేతాలేనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
తగ్గిన నాఫ్తా డిమాండ్
పరిశ్రమల్లో వాడే నాఫ్తా వినియోగం కూడా గత ఆర్థిక సంవత్సరం అంతకుముందుతో పోల్చితే 4.8 దిగజారి 13.15 మిలియన్ టన్నులుగానే ఉన్నట్టు తాజా గణాంకాల్లో తేలింది. ఫ్యూయెల్ ఆయిల్ వాడకం సైతం దాదాపు 1 శాతం క్షీణించి 6.45 మిలియన్ టన్నులుగానే ఉన్నది. అలాగే రోడ్ల నిర్మాణంలో వాడే బిటుమెన్ వినియోగం 5.4 శాతం తగ్గి 8.33 మిలియన్ టన్నులుగా ఉన్నది. అయితే గత ఆర్థిక సంవత్సరం దేశీయంగా పెట్రోల్ వాడకం 7.5 శాతం పెరిగి 40 మిలియన్ టన్నులను తాకింది. ఎల్పీజీ డిమాండ్ కూడా 5.6 శాతం ఎగిసి 31.32 మిలియన్ టన్నులకు చేరింది. విమానాల్లో జెట్ ఇంధన వాడకం 9 శాతం ఎగబాకి 9 మిలియన్ టన్నులుగా నమోదైంది. పెట్రోలియం కోక్ డిమాండ్ 8.6 శాతం పెరిగితే, లూబ్రికెంట్స్, గ్రీజులు 12.3 శాతం ఆదరణను చూశాయి. మొత్తంగా డీజిల్ దెబ్బకు గత ఆర్థిక సంవత్సరం చమురు వినియోగ వృద్ధి కరోనా విజృంభించిన 2019-20, 2020-21ని మినహాయిస్తే దశాబ్దం కనిష్ఠానికే పతనమైనట్టు చెప్పుకోవచ్చు..