IT Notices | మీరు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారా.. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టారా… బ్యాంకులు, వివిధ సంస్థల మ్యూచువల్ ఫండ్స్‌లో సొమ్ము మదుపు చేశారా.. ఆస్తుల కొనుగోళ్లు జరిపారా.. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టారా… అయితే, అధిక మొత్తంలో లావాదేవీలు జరిపిన వ్యక్తులు.. ఆ లావాదేవీలు పరిమితులు దాటి ఉంటే.. తప్పనిసరిగా ఆదాయం పన్నుశాఖకు ఆ వివరాలు వెల్లడించడం తప్పనిసరి. అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన వ్యక్తులు తమ ఐటీ రిటర్న్స్‌లో వాటి వివరాలు రిపోర్ట్ చేయలేదనుకోండి.. ఆ వ్యక్తుల వివరాలను పొందేందుకు ఆదాయం పన్నుశాఖకు పలు దర్యాప్తు సంస్థలతో అనుబంధం ఉంటుంది. ఆయా దర్యాప్తు సంస్థల ద్వారా సదరు వ్యక్తుల ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ సేకరిస్తారు. పరిమితి మించి చేసే మదుపు, పెట్టుబడుల వివరాలు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్‌లో తెలియజేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెగేసి చెప్పింది. ఇలా చేయని వారికి తప్పనిసరిగా ఐటీ శాఖ నోటీసులు అందుతాయంటున్నారు సాగ్ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా.
బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు రూ.10 లక్షలు దాటొద్దు. ఒకవేళ అధిక మొత్తంలో నగదు ఉంటే సంబంధిత డిపాజిటర్‌ను రూ.10 లక్షలు దాటకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని బ్యాంకర్లు సూచిస్తారు. బ్యాంకులతో ఆదాయం పన్నుశాఖ అధికారులకు లింక్‌లు ఉంటాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లలో పరిమిత స్థాయికి మించి నగదు జమ చేసిన ఖాతాల వివరాలు ఆదాయం పన్నుశాఖకు తప్పనిసరిగా అందజేయాలని బ్యాంకర్లను సీబీడీటీ ఆదేశించింది.
ఒకవేళ మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షలకంటే ఎక్కువగా జమ చేశారనుకోండి. మీకు ఆదాయం పన్నుశాఖ నుంచి నోటీసు వస్తుందంటున్నారు సాగ్ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా. ఆదాయం పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతా (ఎస్/బీ)లో రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు దాటితే తప్పనిసరిగా ఐటీ అధికారులకు తెలపాల్సిందే. కరంట్ ఖాతా దారులకు రూ.50 లక్షల వరకు పరిమితి ఉంటుంది.
ఒక ఏడాదిలో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు రూ. లక్ష, అంత కంటే ఎక్కువ చేస్తే.. ఐటీ అధికారులకు తెలుపాల్సిందేనని సీబీడీటీ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లుల సెటిల్మెంట్కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అదనంగా చెల్లించినా.. తప్పక ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందే. క్రెడిట్ కార్డు లావాదేవీలకు కూడా ఆదాయం పన్ను వర్తిస్తుంది. కనుక మీరు పరిమితికి లోబడి క్రెడిట్ కార్డు వాడుకోవాలి. మీ పాన్ కార్డు ఆధారంగా.. మీ క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ ఐటీ అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఏదేనీ పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తే ముందే బయట పెట్టాల్సిందే. ఐటీఆర్‌లో ఫామ్26ఏఎస్ ద్వారా ఆ వివరాలను ముందే సమర్పిస్తే.. ఐటీ శాఖ నుంచి నోటీసులు రావని అమిత్ గుప్తా అంటున్నారు.
మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేశారా.. దాని విలువ రూ.30 లక్షలు, అంతకంటే ఎక్కువగా ఉంటుందా.. అయితే, నిబంధనల ప్రకారం సంబంధిత రిజిస్ట్రార్… ఆ లావాదేవీ వివరాలను ఐటీ అధికారులకు తెలియజేస్తారు. కనుక మీరు ఐటీ చట్టంలోని 26ఏఎస్ ఫామ్ కింద ముందే సదరు భూమి లేదా స్థిరాస్తి కొనుగోలు వివరాలు సమర్పించాల్సిందే. ఒకవేళ మీ ఆస్తి విలువ రూ.30 లక్షల పై చిలుకైతే ఆదాయం పన్ను వర్తిస్తుంది. మీరు కొనుగోలు చేసిన ఇల్లు లేదా స్థిరాస్తి ఆధారంగా మీ ఐటీ రిటర్న్స్‌ను ఐటీ అధికారులు తనిఖీ చేస్తారు.. పరిస్థితిని బట్టి మీకు నోటీసులు జారీ చేస్తారు.
డబ్బు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని వివిధ పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్, స్క్రిప్ట్స్, డిబెంచర్లు, బాండ్ల కొనుగోళ్లు రూ.10 లక్షలు దాటాయనుకుందాం.. వెంటనే ఐటీ శాఖ అప్రమత్తం అవుతుంది. అత్యధిక విలువతో కూడిన నగదు లావాదేవీలు జరిపిన వారి లావాదేవీలపై యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ (ఏఐఆర్) స్టేట్మెంట్ సిద్ధం చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో జరిపిన అన్యూజువల్ లావాదేవీల వివరాలు ఐటీ అధికారులు సేకరిస్తారు. ఏదేనీ ఖర్చు.. మొత్తం లావాదేవీల్లో లిస్టయితే.. ఐటీ అధికారులు మీరు సమర్పించిన 26ఏఎస్ ఫామ్‌లో ఏఐఆర్ సెక్షన్‌తో వెరిఫై చేసుకుంటారు.
విదేశీ కరెన్సీ విక్రయించినా, ఇతర కరెన్సీ మీ ఖాతాలో క్రెడిట్ అయినా.. అది రూ.10 లక్షలు, అంత కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఐటీ విభాగం నోటిఫై చేయాల్సిందే. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా ఇన్సూరెన్స్ ట్రావెలర్ తదితర రూట్లలో ద్వారా ఏ ఇతర కరెన్సీ వచ్చినా దాన్ని ఐటీ అధికారులకు నోటిఫై చేయాల్సిందే.