శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 12, 2020 , 00:56:17

పిలిస్తే వస్తా..

పిలిస్తే వస్తా..

  • కరోనాపై పోరులో దేశానికి సేవ చేస్తా:  రఘురామ్‌ రాజన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: భారత్‌లో కరోనాపై పోరులో భాగస్వామి కావడానికి సిద్ధమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. పిలిస్తే వస్తానన్నారు. ఈ మహమ్మారి నిర్మూలనకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుండగా, తిరిగి ఉత్తేజపరుచడం ఓ సవాల్‌గా కనిపిస్తున్నది. అయితే మోదీ సర్కారు ఆహ్వానిస్తే దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్‌ అన్నారు. మూడేండ్లు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు వర్సిటీ ఆఫ్‌ బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ‘అమెరికా, ఇటలీ తరహాలో భారత్‌లోనూ వైరస్‌ విజృంభిస్తే దాన్ని చాలాచాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది’ అన్నారు. 

యావత్‌ ప్రపంచం మాంద్యం ఊబిలో కూరుకుపోతున్నదన్న ఆయన తగిన నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఏడాది కోలుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత్‌ విషయానికొస్తే.. ‘దేశంలో తరచూ కనిపించే సమ స్యే విదేశీ మారకం. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మన మారకం రేటు కొంత స్థిరంగానే ఉంటుంది. ఇందుకు ఆర్బీఐ సహకారం కూడా ఉన్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇటీవలికాలంలో బాగానే పడిపోతున్నది. అయితే బ్రెజిల్‌ లాంటి దేశాల కరెన్సీలైతే 25 శాతం క్షీణించాయి. అలాంటి పరిస్థితి మనకు లేదు’ అన్నారు.


logo