Credit Cards | ఇప్పుడు అంతా డిజిటల్ యుగం.. క్షణాల్లో ఆన్లైన్లో పేమెంట్స్ జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా చెల్లింపులు పూర్తి చేస్తున్నాం. ఇటీవలే యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డులతో చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. త్వరలో వీసా, మాస్టర్ కార్డు జారీ చేసిన క్రెడిట్ కార్డులతో యూపీఐ చెల్లింపులకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది. ఇందుకు ఆర్బీఐ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సంబంధిత ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ల కథనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసే నాటికి ఆర్బీఐ అధికారికంగా ఈ విషయమై ప్రకటన చేయనున్నది.
డెబిట్ కార్డులు, కొన్ని ఎంపిక చేసిన రూపే క్రెడిట్ కార్డులతో పాపులర్ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‌గా పేరొందిన యూపీఐ పేమెంట్స్‌కు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. దేశంలో యూపీఐ సేవలు అమల్లోకి తెచ్చిన ఆరేండ్ల తర్వాత క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్‌కు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
వీసా, మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్‌లకు చెందిన ఏడు కోట్లకు పైగా క్రెడిట్ కార్డులను యూజర్లు వాడుతున్నారు. ఆర్బీఐ అనుమతి ఇస్తే పేటీఎం, జీ-పే, ఫోన్‌పే, భారత్ పే, అమెజాన్ పే వంటి ఇన్స్టంట్ పేమెంట్ చానెల్ ద్వారా పేమెంట్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. బ్యాంకులు ఇన్స్టంట్ పేమెంట్ చానెల్ ద్వారా రుణాల మంజూరుకు మార్గం సుగమం అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ల రూపే క్రెడిట్ కార్డులపై యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీసుకొచ్చిన న్యూ యూపీఐ ఫీచర్‌కు యూజర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇక వచ్చే మార్చి నాటికి ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్ జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డులు కూడా ఈ సేవల్లోకి ఎంటర్ కానున్నాయి. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డులతో .2000 లోపు చెల్లింపులపై అదనపు చార్జీలు వసూలు చేయరాదని కూడా ఎన్పీసీఐ నిర్ణయించింది.