ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే.. అయినా బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్ డ్రాయల్స్, డిపాజిట్లు చేస్తూనే ఉన్నారు. భారీ మొత్తంలో నగదు చెల్లింపులకు చెక్ కూడా జారీ చేస్తుంటారు. ఇలా జారీ చేసిన చెక్ క్లియరెన్స్ అయి, నగదు రూపంలోకి మార్చుకోవడానికి ప్రస్తుతం రెండు రోజులు పడుతున్నది. క్షణాల్లో అన్ని రకాల చెల్లింపులు జరుగుతున్న వేళ.. చెక్ క్లియరెన్స్ కోసం రోజుల టైం తీసుకోవడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఫోకస్ చేసింది. ఇక నుంచి కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్ చేసేందుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నది.
ఇప్పుడు చెక్ క్లియరెన్స్ కోసం టీ+1 విధానం అమలవుతున్నదని, దీని క్లియరెన్స్ టైం కొన్ని గంటల్లోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) విధానంలో మార్పులు చేస్తారు. బ్యాచ్‌ల వారీగా కాకుండా ‘ఆన్ రియలైజేసన్ సెటిల్మెంట్’ పాలసీ అమలు చేస్తామని ఆయన తెలిపారు. బ్యాంకు పని గంటల్లో చెక్ స్కాన్ అండ్ ప్రెజెంట్ చేసి కొన్ని గంటల్లో పాస్ చేయాలని చెప్పారు. బ్యాంకు ఖాతాదారుల ఎక్స్పీరియన్స్ మరింత మెరుగు పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.