ఆర్బీఐ మరోసారి వడ్డించింది. అంతా ఊహించినట్టే ఇంకో పావుశాతం వడ్డీరేటును పెంచింది. వరుసగా ఆరోసారీ బాదేసింది.
గత ఏడాది మే నుంచి ఇప్పటిదాకా రెపోరేటు 250 బేసిస్ పాయింట్లు (2.5 శాతం) పెరిగింది. ఇందుకు తగ్గట్టు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా అదే స్థాయిలో అటూఇటూగా రుణాలపై వడ్డీరేట్లను పెంచేశాయి.
ఏడాదిన్నర, రెండేండ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నవాళ్లకు నిజంగా ఏడుపే మిగిలింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కరోనా సమయంలో కనీవినీ ఎరుగనంత తక్కువ వడ్డీరేట్లు ఉన్నాయంటూ ఊదరగొట్టి జనాలను హౌజింగ్ లోన్ల వైపు రుణదాతలు నడిపించారు. కానీ ఈ ఆనందం ఇప్పుడు ఆవిరైపోతున్నది.
రుణభారం పెరిగిపోతున్నది. వచ్చే నెలాఖరుతో ముగిసిపోయే ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రతీ రెండు నెలలకోసారి రుణాలపై వడ్డీరేట్లు పెరిగాయి మరి. అధిక ద్రవ్యోల్బణం పేరుచెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పదేపదే రెపోరేటును పెంచుతుండటం సామాన్యుడి జేబును గుల్లచేస్తోంది. కరోనా ప్రభావ పరిస్థితులతో అసలే ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగక అవస్థలు పడుతున్న సగటు వేతన జీవికి ఈ వడ్డింపులు పెద్ద సమస్యగానే పరిణమించాయి.
రుణానికి సమానంగా వడ్డీ భారం
తీసుకున్న రుణ మొత్తానికి సమానంగా వడ్డీ భారం ఉంటున్నది. రూ.50 లక్షల గృహ రుణాన్ని మీరు ఏడాదిన్నర, రెండేండ్ల క్రితం 7 శాతానికి 20 ఏండ్ల కాలపరిమితితో తీసుకున్నారని అనుకుందాం. అందుకోసం ఈ 20 ఏండ్లలో మీరు చెల్లించే మొత్తం దాదాపు కోటి రూపాయలుగా ఉంటున్నది. పెరిగిన వడ్డీరేట్లతో చూస్తే కోటి రూపాయలపైనే కట్టాల్సి వస్తున్నది. ఈఎంఐలు పెంచుకున్నా.. టెన్యూర్ పెరిగినా చివరకు రుణగ్రహీతపై మోయలేనంత వడ్డీ భారమే పడుతున్నది. మొత్తానికి నెలంతా కష్టపడి అందుకున్న సంపాదనలో పెద్ద మొత్తం రుణదాతలకే ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందిప్పుడు. వాహన, విద్య, వ్యక్తిగత రుణాలపైనా ఈ వడ్డీ భారం ప్రభావవంతంగానే ఉన్నది. అయితే గృహ రుణం దీర్ఘకాలం ఉండేది కనుక మరింత భారం మోయాల్సి వస్తున్నది.
తెలియకుండానే కత్తెర
సాధారణంగా 20 ఏండ్లు, అంతకంటే తక్కువ కాలపరిమితి ఉన్న గృహ రుణగ్రహీతలకు నెలనెలా చెల్లించే ఈఎంఐ భారంలో ఎలాంటి మార్పూ కనిపించకపోవచ్చు. అయితే వయస్సు, ఆర్థిక స్థితిగతులు, సిబిల్ ఇలా.. వివిధ అంశాలు పరిగణనలోకి తీసుకున్నాక కొంతమందికి టెన్యూర్ పెంచే అవకాశం ఉండదు. గరిష్ఠంగా 30 ఏండ్లకు మించి ఈఎంఐ చెల్లింపుల కాలపరిమితి పెంచే మార్గం లేనప్పుడు ఈఎంఐ విలువను ఎప్పటికప్పుడు పెంచుతున్నాయి బ్యాంకులు. దాంతో తక్షణం ఆ పెంపు ఎఫెక్ట్ వాళ్లకు మాత్రమే కనిపిస్తోంది. మిగతావాళ్లకు మాత్రం ఈఎంఐలు అలానే ఉంటున్నాయి. కానీ గడిచిన దాదాపు 10 నెలల్లో రుణ కాలపరిమితి రెండేండ్ల నుంచి ఐదేండ్ల వరకూ పెరుగుతూ వచ్చింది. కాబట్టి వీరందరికీ తెలియకుండానే కత్తెర పడుతున్నది.
ఇప్పుడేం చేద్దాం
వీలైనంతవరకు మీ ఈఎంఐ (నెలసరి వాయిదా చెల్లింపులు)ని వడ్డీరేట్ల పెంపు ఆధారంగా పెంచుకోవడానికే ప్రయత్నించండి. లేకపోతే అనవసరంగా టెన్యూర్ పెరగడంతో మీరు అధిక వడ్డీ భారాన్ని మోయాల్సి ఉంటుంది. తీసుకున్న అసలు రుణంలో కనీసం ఏటా 5-10 శాతం మేరకు ముందస్తు చెల్లింపులకైనా ప్రయత్నించండి. ఒకవేళ మీరు తీసుకున్న లోన్ రూ.50 లక్షలు అనుకుంటే.. అందులో ఏడాదికి రూ.2.5 లక్షలైనా ప్రీ-పేమెంట్ చేయండి. ఎప్పుడైనా బోనస్ వంటివి లేదా అనుకోకుండా నగదు చేతికి వచ్చినప్పుడు ఈ భారాన్ని ఇంకాస్త దించుకోండి. వడ్డీరేట్లు తక్కువగా ఉన్న ఇతర సంస్థల్లోకి రుణాన్ని బదిలీ చేసుకుంటే లాభమా? అని పరిశీలించండి. మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే వడ్డీరేట్ల విషయంలో బేరమాడండి.
–నాగేంద్ర సాయి కుందవరం
