ముంబై, మార్చి 28: నగదు అవసరం ఉన్నప్పుడల్లా కనిపించిన ఏటీఎంల్లోకి వెళ్లి కార్డులను ఎడాపెడా వాడేస్తున్నారా?.. అయితే ఇక మీదట జాగ్రత్తగా ఉండకపోతే మరింతగా నష్టపోవాల్సి వస్తుంది. అవును.. ఏటీఎం చార్జీలను పెంచుకొనేందుకు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం అనుమతి ఇచ్చింది మరి. ప్రతి నెలా ఉచిత నగదు ఉపసంహరణలకున్న పరిమితి దాటితే ఒక్కో నగదు ఉపసంహరణకు రూ.23 చార్జీ పడనున్నది. మే 1 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఈ చార్జీ రూ.21గా ఉన్నది. కానీ దీనికి అదనంగా మరో రూ.2 పెంచుకోవచ్చని బ్యాంకులకు ఆర్బీఐ ఓ సర్క్యులర్లో స్పష్టం చేసింది.
ఇదీ సంగతి..
బ్యాంక్ ఖాతాదారులు ప్రతి నెలా తమకు ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎంల్లో ఐదుసార్లు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను ఉచితంగానే జరుపుకోవచ్చు. అలాగే ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో మూడుసార్లు (హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో) ఈ లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. నాన్ మెట్రో నగరాల్లోనైతే ఐదుసార్లు ఫ్రీ. అయితే ఈ పరిమితులు దాటితే రూ.21 చార్జీ వేస్తున్నారు.
రంజాన్ రోజూ బ్యాంకులకు పనిదినమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ముగిసే రోజు కావడంతో రంజాన్ పర్వదినమైనప్పటికీ మార్చి 31 (సోమవారం)న బ్యాంకులు యథాతథంగానే పనిచేయనున్నాయి. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. సాధారణంగా రంజాన్ పండుగకు బ్యాంకులకు సెలవు. అయితే ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు కావడంతో ఆదాయ పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ఇతర ప్రభుత్వ-ప్రైవేట్ లావాదేవీలు, చెల్లింపులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా బ్యాంకులు పనిచేయబోతున్నాయి.
నిజానికి శని, ఆది, సోమవారాల్లో దేశవ్యాప్తంగా అన్ని ఐటీ ఆఫీసులు, సీజీఎస్టీ కార్యాలయాలు పనిచేయనున్నట్టు ఆయా శాఖలు ప్రకటించాయి. ఇక సోమవారం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద స్పెషల్ క్లియరింగ్ ఆపరేషన్స్నూ బ్యాంకులు నిర్వహించాలని ఆర్బీఐ ఆదేశించింది. ప్రజెంటేషన్ టైం సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటలదాకా, రిటర్న్ టైం సెషన్ రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల వరకు ఉంటుంది.