న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కు చెందిన ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) రెపో రేటుపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని, యథాతథంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. ఆర్బీఐ రెపో రేటులో మార్పులు చేయకుండా ఉంచడం ఇది నాలుగోసారి. రెపో రేటును యథాతథంగా కొనసాగించడంపై MPC ఏకగ్రీవంగా ఓటేసిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) తెలిపారు.
ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం గృహ రుణాల ఈఎంఐలు కడుతున్న వినియోగదారులకు శుభవార్తగా చెప్పవచ్చు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 6.5 శాతంగా పేర్కొన్నది. సెప్టెంబర్ 29 నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 586.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని, వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గవచ్చని శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తంచేశారు.
నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు.