Paytm-RBI | కేవైసీ, ఇతర రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)కు ఆర్బీఐ సడలింపు ఇచ్చింది. కస్టమర్ ఖాతాలపై టాపప్ లేదా క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్ల సేకరణ, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాల నిర్వహణ నిలిపివేత గడువు పొడిగించింది. మర్చంట్లతోపాటు కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 15 రోజుల గడువు పెంచినట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.
ఈ నెల 29 తర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ లావాదేవీలు, టాపప్ రుణాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాలు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల లావాదేవీలు నిర్వహించొద్దని ఇంతకుముందు గత నెల 31న పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా మర్చంట్లతోపాటు ఖాతాదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి పేటీఎం మరికొంత సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ కస్టమర్లు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
పేటీఎం వాలెట్లు, పేమెంట్స్ ద్వారా రూ.కోట్లలో మోసపూరిత లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి ఆడిటర్లు ఇచ్చిన అడిట్ నివేదిక ఆధారంగా పేటీఎం అనుబంధ పీపీబీఎల్ పై చర్యలు తీసుకున్నది. పీపీబీఎల్లో పర్యవేక్షణా లోపాలు ఉన్నాయని తేలడంతోనే దానిపై మరింత రెగ్యులేటరీ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ వివరించింది.