RBI | ముంబై, ఆగస్టు 8: ట్యాక్స్ పేయర్స్ సౌకర్యార్థం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా పన్ను చెల్లింపులకున్న పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణనీయంగా పెంచింది. ఏకంగా రూ.5 లక్షలదాకా పెంచుతూ గురువారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయించారు. ఇంతకుముందు ఇది లక్ష రూపాయలే. తాజా నిర్ణయం.. నగదు లావాదేవీలను తగ్గించి, యూపీఐ వినియోగాన్ని మరింత పెంచగలదన్న ఆశాభావాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు.
పెద్ద మొత్తంలో పన్ను చెల్లించేవారికి ఇది కలిసొస్తుందని, చిన్నచిన్న మొత్తాల్లో కాకుండా.. చాలామందికి ఒకేసారి ట్యాక్స్ పేమెంట్స్‌కు వీలు చిక్కుతుందని ద్రవ్యసమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సులువుగా పన్ను బకాయిలను చెల్లించేందుకూ ట్యాక్స్ పేయర్స్‌ను ప్రోత్సహించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. గత ఏడాది డిసెంబర్లో దవాఖానలకు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించుకునే సదుపాయాన్ని ఆర్బీఐ ఇచ్చింది. మునుపు ఇది లక్షే.
యూపీఐ ద్వారా డెలిగేటెడ్ చెల్లింపుల సదుపాయాన్ని ఆర్బీఐ కొత్తగా పరిచయం చేసింది. దీనివల్ల డిజిటల్ పేమెంట్స్ వినియోగం మరింత లోతుగా జరుగుతుందని చెప్పింది. ఈ సౌకర్యంతో ప్రధాన కస్టమర్.. తన బ్యాంక్ ఖాతా నుంచి తాను నిర్ణయించిన మొత్తాన్నే మరో వ్యక్తి (సెకండరీ యూజర్) యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని ఇవ్వగలరు. ఈ ప్రక్రియలో సెకండరీ యూజర్ యూపీఐకి ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా లింకై ఉండాల్సిన అవసరం లేదు.
గృహ రుణాలపై టాప్-అప్లు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పెరుగుతుండటంపట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. టాప్-అప్ల ద్వారా పొందిన నగదు మొత్తాలను స్టాక్ మార్కెట్ల వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతుండవచ్చన్న అనుమానాల్ని వెలిబుచ్చింది. ఈ క్రమంలోనే హోమ్ లోన్లపై టాప్-అప్లు ఇస్తే ఎందుకు వినియోగిస్తున్నారన్నది ఆరా తీయాలని బ్యాంకులకు సూచించింది.
ఈ ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటును 6.50 శాతం వద్దే యథాతథంగా ఆర్బీఐ ఉంచింది. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీలో నలుగురు మద్దతు పలికారు. దీంతో వరుసగా 9వ ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉన్నైట్టెంది. కాగా, గత ఏడాది ఫిబ్రవరిలో చివరిసారిగా రెపోను పెంచారు. అప్పట్నుంచి అది అక్కడే ఉంటున్నది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై ఈఎంఐలు భారంగానే నడుస్తున్నాయి.
ఇకపై చెక్ క్లియరెన్స్‌లు వేగంగా జరిగిపోనున్నాయి. ప్రస్తుతం చెక్ డిపాజిట్ చేసిన దగ్గర్నుంచి అది క్లియర్ కావడానికి రెండు పనిదినాలు పడుతుండగా.. దీన్ని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే బ్యాంకులు పూర్తిచేయాలని ఆర్బీఐ గవర్నర్ దాస్ ద్రవ్యసమీక్ష సందర్భంగా ప్రతిపాదించారు. ఇప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ మోడ్‌లో చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద చెక్కుల క్లియరెన్స్ జరుగుతున్నది. అయితే ఇకపై సీటీఎస్‌లో ‘ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్’తో చెక్ క్లియరెన్సులు జరగాలన్నారు. దీనివల్ల పేమెంట్స్ చేసేవారికి, తీసుకునేవారికి లాభిస్తుందన్నారు.