auto-debit rules : ఆటోడెబిట్ విషయంలో ఇకపై కొత్త రూల్స్ అమలుకానున్నాయి. ‘డిజిటల్ పేమెంట్స్, ఈ మ్యాండేట్ ఫ్రేమ్‌వర్క్, 2026’లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త రూల్స్‌ను అమలుచేయబోతుంది. ఈ రూల్స్ కోట్లాది మంది భారతీయ వినియోగదారులకు మేలు చేస్తాయని ఆర్బీఐ భావిస్తోంది. ఈఎంఐలు, సబ్స్క్రిప్సన్స్, బిల్స్ వంటి వాటి విషయంలో నెలనెలా డెబిట్ అయ్యే నగదు విషయంలో కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
త్వరలో అమలు కాబోయే కొత్త రూల్స్ ఇవి. ఇకపై ప్రతి బ్యాంకు లేదా సంస్థ ఆటో డెబిట్‌కు కనీసం 24 గంటల ముందు అలర్ట్ ఇవ్వాలి. అందులోనూ కంపెనీ పేరు, అమౌంట్ వివరాలు, తేదీ, ఇతర కీలక సమాచారం తప్పనిసరిగా ఉండాలి. దీనివల్ల వినియోగదారులు అనవసరమైన ఆటో డెబిట్స్‌ను అడ్డుకునే వీలుంటుంది. రూ.15,000 లేదా ఆలోపు ఆటో డెబిట్ చెల్లింపులకు ఓటీపీ అవసరం లేదు. అలాగే, ఇన్సురెన్స్ ప్రీమియమ్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ వంటి వాటికి ఈ పరిమితి రూ.1 లక్ష. ఇకపై యూజర్లు తమ పేమెంట్లను నచ్చినప్పుడు మార్చుకోవడం, రద్దు చేసుకోవడం చేయొచ్చు. ఈ విషయంలో వినియోగదారుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కొత్త డెబిట్ లేదా క్రెడిట్ కార్డు మార్చుకున్న తర్వాత వాటికి తిరిగి ఆటో పేమెంట్స్ సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
గతంలో పాత కార్డుకు లింకై ఉన్న పేమెంట్స్.. ఆటోమేటిగ్గా కొత్తవాటికి బదిలీ అవుతాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ ఉపయోగించి చేసే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, వాటర్ బిల్లులు, ఈఎంఐలు, ఇతర చెల్లింపులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల వంటి వాటికి ఈ నిబంధనలు వర్తించవు.