Reliance-Ram Mandir | అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ భారతీయులంతా ఆసక్తిగా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రముఖ కార్పొరేట్ సంస్థ రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 22వ తేదీన (సోమవారం) తమ సంస్థ ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రిలయన్స్ సిబ్బందికి సెలవు వర్తిస్తుంది.
రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలువ ప్రకటించారు. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఉద్యోగులంతా పాల్గొనడానికి వీలుగా సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం పూర్తిగా సెలవు ప్రకటించగా, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్ గఢ్, అసోం, ఒడిశా హాఫ్ డే సెలవు ఇచ్చాయి.