Home Sales | సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. ఇప్పుడు ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు బ్యాంకు రుణాలపై ఇల్లు కొనుక్కోవాల్సిందే. అయితే, అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల విక్రయాలు 21 శాతం తగ్గాయి. అందులో ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) మాత్రం మినహాయింపు. అధిక బేస్ ధరల ప్రభావం వల్లే ఇండ్ల ధరలు తగ్గాయని రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ ప్రాప్-ఈక్విటీ పేర్కొంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, నేవీ ముంబై, కోల్కతా, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, ఠాణె నగరాల్లో ఇండ్ల విక్రయాల వివరాలను ప్రాప్ఈక్విటీ శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1,08,261 యూనిట్ల విక్రయాలు పడిపోయాయి. 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 1,37,225 యూనిట్ల ఇండ్ల విక్రయాలు జరిగాయి. అయితే, సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఐదు శాతం సేల్స్ పెరిగాయి.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 1,03,213 ఇండ్ల నుంచి ఐదు శాతం విక్రయాలు పెరిగాయి. హై బేస్ రేట్ వల్లే ఇండ్ల విక్రయాలు తగ్గాయని ప్రాప్ఈక్విటీ ఫౌండర్ కం సీఈఓ సమీర్ జాసుజా తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో మూలాలు బలంగా ఆరోగ్యకరంగా ఉన్నాయన్నారు. గుర్గావ్ పరిధిలో లగ్జరీ ఇండ్లకు డిమాండ్ కొన్నేండ్లుగా అసాధారణ రీతిలో పెరుగుతోంది. 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో 10,354 ఇండ్లు అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది 12,915 ఇండ్ల విక్రయాలు జరిగాయి. అంటే 25 శాతం సేల్స్ పుంజుకున్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో 47 శాతం విక్రయాలు తగ్గాయి. 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో 24,044 ఇండ్ల విక్రయాలు జరిగితే ఈ ఏడాది 12,682 ఇండ్ల విక్రయాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో 33 శాతం ఇండ్ల అమ్మకాలు పడిపోయాయి. గతేడాది 5,653 ఇండ్లు అమ్ముడైతే, ఈ ఏడాది 3,763 ఇండ్లకు పరిమితం అయ్యాయి.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 13 శాతం తగ్గిన విక్రయాలు 17,276 యూనిట్ల నుంచి 14,957 యూనిట్లకు పరిమితం అయ్యాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 4,673 యూనిట్ల నుంచి తొమ్మిది శాతం తగ్గి 4,266 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో ఇండ్ల విక్రయాలు 13,878 యూనిట్ల నుంచి 27 శాతం పతనమై 10,077 యూనిట్లకు చేరాయి. నేవీ ముంబై పరిధిలో 13 శాతం విక్రయాలు తగ్గాయి. 2023-24లో 8,607 ఇండ్లు అమ్ముడైతే ఈ ఏడాది 7,478 ఇండ్లకు పరిమితం అయ్యాయి. ఠాణెలో 26,099 యూనిట్ల నుంచి 21,893 యూనిట్లకు పడిపోయాయి. పుణెలో ఇండ్ల విక్రయాలు 24 శాతం తగ్గి పోయాయి.