PwC Layoffs | అకౌంటింగ్’లో ‘బిగ్ ఫోర్’ కంపెనీగా పేరొందిన ప్రముఖ అడిటింగ్ సంస్థ ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) కష్టాల్లో చిక్కుకున్నదా?.. ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ పైనా పడిందా..? అందుకోసం ఉద్యోగుల ఉద్వాసనపై ఫోకస్ చేసిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్.. బ్రిటన్ లో సుమారు 600 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాలని ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తున్నది.
‘బిజినెస్లో గ్రోత్ పడిపోవడం. అట్రిక్షన్ రేట్ 10 శాతం కంటే దిగువ స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఆప్షన్ ఇచ్చాం` అని రాయిటర్స్కు ఇచ్చిన ఒక ఈ-మెయిల్ సమాధానంలో పీడబ్ల్యూసీ తెలిపింది. దీనివల్ల ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందన్న సంగతి వెల్లడించలేదు. తమ అంచనాకు అనుగుణంగా సిబ్బంది వీఆర్ఎస్ ఆప్షన్ ఎంచుకోకుంటే ఉద్యోగుల తొలగింపు తప్పదని పీడబ్ల్యూసీ వర్గాలు తెలిపాయి. బ్రిటన్లో పీడబ్ల్యూసీలో 25 వేల మంది పని చేస్తున్నారు. అన్ని స్థాయిల్లో ఉద్యోగులపైనా ప్రత్యేకించి జూనియర్ స్థాయి ఉద్యోగులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంస్థ అడ్వైజరీ బిజినెస్ విభాగంలో ప్రధానంగా, టాక్స్ విభాగంలో కొంత మేరకు ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పీడబ్ల్యూసీ వర్గాల కథనం. అడిట్ విభాగంపై ఉద్యోగాల కోత ప్రభావం ఉండదని ఆ వర్గాలు చెబుతున్నాయి.
‘బిగ్ ఫోర్’ అకౌంటింగ్ కంపెనీ ‘కేపీఎంజీ’, డెల్లాయిట్ కూడా ఉద్యోగులను కుదించుకోవాలని భావిస్తున్నాయని రాయిటర్స్ గత నెలలో పేర్కొంది. డెల్లాయిట్ బ్రిటన్లో 800 మందికి పైగా తొలగించడానికి ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. గతంతో పోలిస్తే బిజినెస్లు తగ్గిపోయాయని డెల్లాయిట్ ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని సమాచారం.