Tomato | టమోటాలు రోజువారీ కూరల్లో వాడతాం.. కానీ, భారీ వర్షాలతో టమోటా తోటలు దెబ్బ తినడంతో అవసరాలకు సరిపడా దిగుబడి రాలేదు.. ఫలితంగా ఆకాశాన్నంటే రీతిలో టమోటా ధరలు పెరిగిపోతున్నాయ్.. ఇది సగటు భారతీయుడికి దుర్భరంగా మారింది.. కానీ టమోటా పండిస్తున్న రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిధిలోని జున్నార్ గ్రామ వాసి తుకారాం భాగోజీ గయ్కర్, ఆయన కుటుంబం నెల రోజుల్లోనే కోటీశ్వరులయ్యారు. 13 వేల టమోటా బాక్సుల విక్రయంతో తుకారాం భాగోజీ గయ్కర్ కుటుంబానికి 1.5 కోట్ల ఆదాయం లభించింది.
తుకారం భాగోజీ గయ్కర్‌కు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొడుకు ఈశ్వర్ గయ్కర్, కోడలు సొనాలీ సాయంతో 12 ఎకరాల్లో టమోటా తోట సాగు చేశారు. తమ తోటలో మంచి క్వాలిటీ టమోటాలు దిగుబడి అవుతాయని తుకారాం కుటుంబం చెబుతున్నది.
ఈ నెల 11న 20 కిలోల బాక్స్ ధర రూ.2100 పలికింది. మొత్తం 900 బాక్సులు విక్రయిస్తే ఒక్కరోజు రూ.18 లక్షల ఆదాయం వచ్చింది. ఇంతకుముందు కూడా టమోటాల నాణ్యతను బట్టి ఒక బాక్స్ టమోటాలకు రూ.1000 నుంచి రూ.2400 పలికింది. దీంతో ఆయన రూ.1.5 కోట్లకు పైగా ఆదాయం సంపాదించారు.
తుకారం భాగోజీ గయ్కర్ మాత్రమే కాదు.. జున్నార్‌లోని పలువురు రైతులు అధిక ధరలకు టమోటాలు విక్రయించడంతో భారీ ఆదాయాలు పొందుతున్నారు. ఈ సీజన్లో 20 కిలోలు గల బాక్స్ రూ.125 చొప్పున రూ.2500 పలికిందని చెబుతున్నారు. తత్ఫలితంగా టమోటా రైతులు మిలియనీర్లుగా మారిపోతున్నారు.
ఒకవైపు, టమోటా రైతులు మిలియనీర్లు అవుతుంటే.. రిటైల్ మార్కెట్లో వాటి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో కిలో టమోటా ధర సోమ, మంగళవారాల్లో రూ.350 పలికింది. ఇప్పటికీ రూ.200 పై మాటే పలుకుతున్నది. ఘజియాబాద్‌లో కిలో టమోటా రూ.200. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో టమోటా ధర సెంచరీ మార్క్ దాటేసింది.
గత మూడేండ్లుగా వర్షాకాలం సీజన్లో టమోటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 2020లో కిలో టమోటా ధర రూ.70-80 పలికితే, 2021లో రూ.100 మార్క్ చేరుకున్నది. గతేడాది జూన్ నెలలో కిలో టమోటా ధర రూ.60-70 మధ్య పలికింది.
వచ్చే నెలలోనూ టమోటా ధరలు ఇలాగే కొనసాగుతాయని ఇండోర్‌లోని చౌత్రం మండీ వ్యాపారుల సంఘం కార్యదర్శి నిఖిల్ హార్దియా చెప్పారు. ఆగస్టు తర్వాతే క్రమంగా టమోటా ధరలు తగ్గుతాయన్నారు. ఇరుగు, పొరుగు ప్రాంతాల నుంచి టమోటాలు రావడం లేదని, బయటి ప్రాంతాల నుంచి రవాణా అవుతున్నాయని చెబుతున్నారు.
టమోటా తోటల్లో మొక్కలు నాటిన మూడు నెలల తర్వాత వారానికి రెండుసార్లు పంట చేతికి వస్తుందని తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వెరైటీ, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి టమోటా తోటల్లో ఒకటి, రెండు నెలలు పంట దిగుబడి వస్తుందంటున్నారు.