వివిధ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్).. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఖరీదెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రోకర్లు, వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సదరు పెట్టుబడుల ప్రాసెసింగ్ చార్జీలను పెంచే వీలుందన్న అంచనాలు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. సాధారణంగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం యాప్‌లు లేదా ప్లాట్‌ఫామ్స్ 0.75 శాతం మార్జిన్‌ను తీసుకుంటాయి.
అయితే ఈ మార్జిన్లో ఎండీఆర్‌తో 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు కోత పడుతున్నది. ఈ క్రమంలో ఎండీఆర్ పరిధిలోకి ఈ లావాదేవీలనూ తీసుకొస్తే.. సదరు భారాన్ని మదుపర్లపైనే మోపే వీలుందని అంటున్నారు. రూ.2,000, ఆపై లావాదేవీలపై 0.5 శాతం వరకు ఎండీఆర్ చార్జీని విధించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ మేరకు ఓ నిర్ణయం వెలువడనున్నది.
ఉదాహరణకు..
రూ.10,000 మ్యూచువల్ ఫండ్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)పై 0.25 శాతం ఎండీఆర్.. రూ.25 ప్రాసెసింగ్ చార్జీకి దారితీస్తున్నది. రూ.50,000 పెట్టుబడిపై రూ.125 పడుతుంది. ఈ భారాన్ని ఇన్వెస్టర్లపైనే బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ నిర్వహణ కంపెనీలు వేస్తారన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లు దూరం కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. ముఖ్యంగా భారీ పెట్టుబడుల ఫండ్‌కు యూపీఐని వినియోగించే కస్టమర్లకు చార్జీల పోటు తప్పకపోవచ్చు. అలాగే బడా ప్లాట్‌ఫామ్స్‌పై ఈ ప్రభావం పెద్దగానే ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తమ మ్యూచువల్ ఫండ్ సిప్‌లలోకి రూ.46,624 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రముఖ స్టాక్ బ్రోకర్ గ్రో చెప్తున్నది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.34,028 కోట్లుగా ఉన్నాయన్నది. ఈ వేదికకు చెందిన కస్టమర్ల ఆస్తులు రూ.2.96 లక్షల కోట్లు. కొత్త సిప్‌లలో 43 శాతం వాటా దీనిదే. రిటైల్ మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 3.4 శాతం వాటా ఉన్నది. జెరోధా మొదలైన బ్రోకరేజీలూ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు తగ్గిపోతాయని అంటున్నారు. ఈ ఏడాదిలో సెక్యూరిటీస్ బ్రోకర్లు, డీలర్ల లావాదేవీ సగటున రూ.8,963గా ఉన్నది. 2025తో పోల్చితే 5.3 శాతం ఎక్కువ. మొత్తానికి ఎండీఆర్ విధివిధానాలు ఎప్పుడొస్తాయా? అని వెల్త్ మేనేజర్లు, బ్రోకర్లు ఎదురుచూస్తున్నారు.