ICICI Bank | న్యూఢిల్లీ, జూలై 22: ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.9,648 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని గడించింది. గతంలో ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,905 కోట్ల లాభంతో పోలిస్తే 40 శాతం వృద్ధి కనబరిచింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏడాది క్రితం రూ.28,337 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం.. గడిచిన త్రైమాసికానికిగాను రూ.38,763 కోట్లకు చేరుకున్నది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 38 శాతం ఎగబాకి రూ.18,227 కోట్లకు చేరుకుంది. క్రిందటిసారి రూ.13,210 కోట్లుగా ఉన్నది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.4 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గగా.. నికర ఎన్పీఏ 0.7 శాతం నుంచి 0.4 శాతానికి దిగొచ్చింది.