Narendra Modi | ‘ప్రధాని మోదీ ఆసక్తి కనబర్చే రంగంలోకి, అదానీ ముందే ప్రవేశిస్తారు’ అంటూ బ్లూమ్‌బర్గ్ మ్యాగజైన్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. 70కిపైగా భారీ ఒప్పందాలు, కొనుగోళ్లను అదానీ గ్రూప్ పూర్తిచేసింది. తద్వారా సంపదను 70 రెట్లు వృద్ధి చేసుకొన్నది. ఇందులో విదేశీ ఒప్పందాలు కూడా ఉన్నాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ 63 దేశాల్లో 123 పర్యటనలు చేశారు. ఇందులో 40 పర్యటనలు అదానీ కోసమే పూర్తిచేసినట్టు ఆరోపణలున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): 30 ఏండ్ల కిందట అతనో చిరు వ్యాపారి. అయితే, 2014 నాటికి అతని సంపద రూ.17 వేల కోట్లకు చేరింది. కిందటేడాది డిసెంబర్ నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద శ్రీమంతుడిగా రికార్డులకెక్కారు. అప్పుడు అతని సంపద రూ.11.3 లక్షల కోట్లు. అతనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. గడిచిన 9 ఏండ్లలో 70కిపైగా భారీ ఒప్పందాలు, కొనుగోళ్లను అదానీ గ్రూప్ పూర్తిచేసింది. తద్వారా సంపదలో 70 రెట్లు వృద్ధి సాధించింది. అప్తమిత్రుడైన దోస్తుకు ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి ప్రధాన మంత్రి వివిధ దేశాల్లో 40కిపైగా పర్యటనలు చేసినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదానీ కోసం మోదీ దౌత్య సంబంధాలను సైతం తాకట్టు పెట్టినట్టు వార్తలు కూడా గుప్పుమన్నాయి.
అదానీ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చడానికి వివిధ దేశాల్లో ప్రధాని మోదీ 40కిపైగా పర్యటనలు చేసినట్టు విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని పర్యటన తేదీలు.. అదానీ గ్రూప్‌తో ఆయా దేశాల్లోని కంపెనీల ఒప్పందాలను లోతుగా విశ్లేషిస్తే, ఇది నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2014 మేలో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరక్కుండానే నవంబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన.. అక్కడి ప్రభుత్వంతో దౌత్య సంబంధాల్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకొన్నారు. ఒప్పందంలో భాగంగా దేశంలో భారీ రైల్వే, మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
ఈ కాంట్రాక్టులు అనూహ్యంగా అదానీ గ్రూప్‌నకే దక్కాయి. 2015 ఏప్రిల్‌లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన జరగ్గా.. అదానీ గ్రూప్‌తో రాఫెల్ కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకొన్నది. అదే ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన మోదీ.. అదానీ గ్రూప్‌నకు విద్యుత్తు కాంట్రాక్టు వచ్చేలా చేశారన్న ఆరోపణలున్నాయి. అదే ఏడాది నవంబర్‌లో మలేషియాలో మోదీ పర్యటించిన అనంతరం 2017లో అదానీ గ్రూప్‌నకు ఆ ప్రభుత్వం ఐలాండ్ పోర్టు కట్టబెట్టింది. 2016 ఫిబ్రవరిలో స్వీడన్, మార్చిలో ఇజ్రాయెల్, జూన్‌లో అమెరికా, జూలైలో మొజాంబిక్, నవంబర్‌లో జపాన్‌లో మోదీ పర్యటించగా.. అదానీ గ్రూప్‌తో ఆయా ప్రభుత్వాలు పలు ఒప్పందాలు చేసుకొన్నాయి. 2017 నుంచి 2023 వరకు వివిధ దేశాల్లో మరో 30 పర్యటనలను మోదీ పూర్తిచేయగా.. ఆయా దేశాల్లోని కంపెనీలు అదానీ గ్రూప్‌తో పలు ఒప్పందాలు చేసుకొన్నట్టు సమాచారం.
ఆప్తమిత్రుడికి ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను కూడా తాకట్టు పెట్టారని విపక్షాలు మండిపడుతున్నాయి. శ్రీలంక, బంగ్లాతో చేసుకొన్న పవర్ ప్రాజెక్టులను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నాయి. శ్రీలంకలోని మన్నార్‌లో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటు కాంట్రాక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు అప్పగించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై మోదీ ఒత్తిడి తీసుకొచ్చినట్టు గత జూన్‌లో వెల్లడైంది.
శ్రీలంకకు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) అప్పటి చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండోయే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించటం సంచలనం సృష్టించింది. దీంతో అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా లంకలో పెద్దయెత్తున ఉద్యమాలు జరిగాయి. ఇక, అదానీ పవర్‌తో కుదుర్చుకొన్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ఆర్థికంగా తమకు నష్టదాయకంగా ఉన్నదని, ఆ డీల్‌లో సవరణలు చేయాలని పట్టుబడుతూ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు (బీపీడీబీ) ఇటీవల చేసిన సూచనలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి.
ఈ ఒప్పందం కుదర్చడంలో స్వయంగా మోదీ భాగమయ్యారని గట్టిగానే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాకుండా, విమానయానంలో ఎలాంటి గత అనుభవం లేని అదానీ గ్రూప్‌నకు దేశంలోని 8 ఎయిర్‌పోర్టులను 50 ఏండ్లపాటు లీజుకు ఇవ్వడంగమనార్హం. దీంతోపాటు యథేచ్ఛగా బొగ్గు గనులను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేసినట్టు పలు నివేదికలు తూర్పారబట్టాయి. పర్యావరణ నిబంధనలను అతిక్రమించి గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో నిర్మాణాలు చేపట్టినందుకు 2013లో అప్పటి యూపీఏ సర్కారు అదానీ గ్రూప్‌నకు రూ.200 కోట్ల జరిమానా విధించింది. అయితే 2017లో మోదీ సర్కారు ఆ జరిమానాను రద్దు చేయడం విమర్శలకు తావిచ్చింది.
దేశంలోని రవాణాకు కీలకంగా మారిన మొత్తం పోర్టుల్లో అదానీ గ్రూప్ వాటా 24 శాతంగా ఉన్నది. తీరప్రాంతం ఉన్న 8 రాష్ర్టాల్లో 13 పోర్టులు అదానీవే. శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లో కూడా ఈ గ్రూప్‌నకు పోర్టులున్నాయి. దేశంలోని ప్రఖ్యాత నగరాల్లోని 8 విమానాశ్రయాలను 50 ఏండ్లపాటు నిర్వహించే లీజు అదానీ గ్రూప్‌నకే దక్కింది. అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌ను కొనుగోలు చేసి సిమెంటు రంగంలో రెండో అతిపెద్ద అగ్రగామిగా అదానీ గ్రూప్ నిలిచింది. ఎన్డీటీవీ, క్వింటిలియన్‌లో వాటాలను కొని మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్.. బొగ్గు, పునరుత్పాదక, గ్యాస్, విద్యుత్తు, గ్యాస్, రిటైల్, వంటనూనెలు ఇలా కీలక రంగాలన్నింటిలో పాతుకుపోయింది.
అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, ఇండోనేషియా, కజక్‌స్థాన్, కిర్గిస్థాన్, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్.
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బహ్రేయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫిజీ, ఇరాన్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జోర్డాన్, కెన్యా, లావోస్, మారిషస్, మెక్సికో, మంగోలియా, మొజాంబిక్, నెదర్లాండ్స్, ఓమన్, పాకిస్థాన్, పాలస్తీనా, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, ఖతార్, రువాండా, సీషెల్స్, స్పెయిన్, స్వీడన్, తజకిస్థాన్, టాంజానియా, టర్కీ, తుర్కమేనిస్థాన్, ఉగాండా, వాటికన్ సిటీ, వియత్నాం.
P1