న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐకి చెందిన అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లోకి పెట్టుబడులు పోటెత్తాయి. ప్రీ-ఐపీవో ఫండింగ్ రౌండ్లో భాగంగా 26 దేశ, విదేశీ మదుపరులు రూ.4,815 కోట్ల పెట్టుబడుల్ని పెట్టారు. దీంతో రూ.10,602 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు కంపెనీ సమాయత్తమవుతున్నది. శుక్రవారం మొదలయ్యే ఈ పబ్లిక్ ఇష్యూ.. ఈ నెల 16న ముగియనున్నది.
షేర్ ధరల శ్రేణి రూ.2,061-2,165గా ఉన్నది. ఐపీవో దృష్ట్యా కంపెనీ విలువను రూ.1.07 లక్షల కోట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఐసీఐసీఐకి 51 శాతం వాటా ఉన్నది. బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్‌కు మిగతా 49 శాతం వాటా ఉన్నది.
ఇక ఈ నెల 19న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అవనున్నది. ఇప్పటికే ఐసీఐసీఐ గ్రూప్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే ఈ గ్రూప్ నుంచి ఐదో సంస్థ నమోదు కాబోతున్నది.