Post Office FD Vs NSC | డబ్బు పొదుపు చేసుకునేందుకు మనకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వివిధ రకాల మార్గాల్లో డబ్బును పొదుపు చేస్తుంటారు. ఇక కొందరు పోస్టాఫీస్‌లోని పథకాలను కూడా ఉపయోగించుకుంటారు. దేశంలోని పౌరుల కోసం డబ్బును పొదుపు చేసుకునేందుకు పోస్టాఫీస్‌లలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల కన్నా కాస్త వడ్డీ రేటు పోస్టాఫీస్లలోనే ఎక్కువ లభిస్తుందని చెప్పవచ్చు. అయితే పోస్టాఫీస్‌లో చాలా మంది ఎఫ్డీ అంటే.. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో నగదును పొదుపు చేస్తారు. దీంతోపాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) అనే మరో స్కీమ్ కూడా పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటో, దేంట్లో ఎక్కువ వడ్డీ వస్తుందో, దేని ద్వారా మనకు ఎక్కువ లాభం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్‌లో మనం ఎఫ్డీని నిర్ణీత కాలం పాటు ఉంచాల్సి ఉంటుంది. దీన్నే టర్మ్ డిపాజిట్ అని కూడా అంటారు. పోస్టాఫీస్‌లో మనం డబ్బును 1, 2, 3 లేదా 5 ఏళ్ల పాటు ఎఫ్డీలో ఉంచవచ్చు. అలాగే NSC లో కూడా మనం 5 ఏళ్ల వరకు డబ్బును ఉంచి పొదుపు చేసుకోవచ్చు. ఇక పోస్టాఫీస్‌లో ప్రస్తుతం ఎఫ్డీకి గాను 7.5 శాతం వడ్డీని అందిస్తుండగా, NSC లో 7.7 శాతం వడ్డీని ఏడాదికి చెల్లిస్తున్నారు. అయితే వడ్డీ ఎక్కువగా ఉన్నప్పటికీ మనకు NSC లో రిటర్న్స్ తక్కువగా, ఎఫ్డీలో ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
పోస్టాఫీస్‌లో మనం ఎఫ్డీ చేస్తే ఏడాదిలో 4 సార్లు వడ్డీ చెల్లిస్తారు. అదే NSC లో అయితే ఏడాదికి ఒకసారే వడ్డీ చెల్లిస్తారు. కనుకనే ఎఫ్డీ వడ్డీ రేటు తక్కువ అయినప్పటికీ పోస్టాఫీస్‌లో ఎఫ్డీ చేస్తేనే మనకు NSC కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇక ఒక లెక్క ద్వారా కూడా దీన్ని చూద్దాం. ఉదాహరణకు మీరు రూ.1 లక్షను 5 ఏళ్ల పాటు పోస్టాఫీస్‌లో ఎఫ్డీ చేస్తే అప్పుడు ఏడాదికి 4 సార్ల చొప్పున మొత్తం 20 సార్లు వడ్డీ చెల్లిస్తారు. దీంతో మీరు పెట్టిన రూ.1 లక్ష 5 ఏళ్ల తరువాత రూ.1,44,995 అవుతుంది.
ఇక NSC లో అయితే ఏడాదికి ఒకసారే వడ్డీ చెల్లిస్తారు. కనుక 5 ఏళ్లలో మీరు పెట్టిన రూ.1 లక్షలకు కేవలం 5 సార్లు మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. దీంతో మీరు NSC లో పెట్టిన రూ.1 లక్ష 5 సంవత్సరాల తరువాత రూ.1,44,903 అవుతుంది. అయితే ఎఫ్డీ, NSC రిటర్న్స్‌కు మధ్య పెద్ద తేడా లేనప్పటికీ ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేస్తే మాత్రం కచ్చితంగా తేడా వస్తుంది. అందువల్ల పోస్టాఫీస్‌లో మీరు డబ్బును దాచుకునే పని అయతే NSC కి బదులుగా ఎఫ్డీ మేలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక పోస్టాఫీస్‌లో ఇవే కాకుండా మరెన్నో పథకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వడ్డీ ఎక్కువ వస్తుందని మాత్రం పథకంలో చేరకండి. అందులో వడ్డీని ఎలా చెల్లిస్తారు, ఎన్ని సార్లు చెల్లిస్తారు.. అన్న విషయాలను పూర్తిగా పరిశీలించాకే ఏ పథకంలో అయినా చేరండి. దీంతో ఎక్కువ మొత్తంలో లాభం పొందవచ్చు.