IRDAI | జీవిత బీమా ఉత్పత్తుల విషయమై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీదారులు తమ అవసరాలను తీర్చుకోవడానికి సేవింగ్స్ సంబంధ బీమా ఉత్పత్తులపై సదరు బీమా సంస్థలు తప్పనిసరిగా రుణ పరపతి కల్పించాలని ఐఆర్డీఏఐ తేల్చి చెప్పింది. దీంతోపాటు బీమా పాలసీ నియమ నిబంధనలు అర్థం చేసుకోవడానికిచ్చే ప్రీ లుక్ పీరియడ్ 15 నుంచి 30 రోజులకు పెంచాలని పేర్కొంటూ ఐఆర్డీఏఐ బుధవారం మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది.
కోట్ల మంది బీమా పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటానికి అనునిత్యం తెస్తున్న సంస్కరణల్లో భాగంగానే ఈ సర్క్యులర్ జారీ చేశామని ఐఆర్డీఏఐ వెల్లడించింది. బీమా పాలసీదారుల్లో సంతృప్తిని మెరుగు పరిచేందుకు అనుకూల వాతావరణం కల్పించడంలో భాగంగా ఈ మార్పులు తెచ్చామని పేర్కొంది. పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహం, ఇంటి కొనుగోలు, వైద్య ఖర్చులు తదితర అవసరాలు తీర్చుకోవడానికి పెన్షన్ బీమా ఉత్పత్తుల్లో పాక్షిక విత్ డ్రాయల్స్కు అనుమతించాలని బీమా సంస్థలకు సూచించింది. ఇక పాలసీదారుల ఫిర్యాదుల ఫరిష్కారానికి బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. పాలసీదారుల ఫిర్యాదుపై బీమా అంబుడ్స్ మన్ ఆదేశాలు 30 రోజుల్లో అమలు చేయకుంటే ఒక్కో ఫిర్యాదుపై రోజుకు రూ.5,000 చొప్పున బీమా సంస్థ జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆ సర్క్యులర్లో వివరించింది.