రాంచీ, మే 3: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజ కంపెనీ కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి తెలుగు వ్యక్తి అయిన పీఎం ప్రసాద్‌ను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పీఈఎస్బీ) సిఫార్సు చేసినట్టు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రస్తుతం పోలవరపు మల్లిఖార్జున ప్రసాద్..కోల్ ఇండియా సబ్సిడరీ, రాంచీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ సీఎండీగా ఉన్నారు.
కోల్ ఇండియా సీఎండీ పదవికి ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఏడుగురు అధికారుల్లో పీఎం ప్రసాద్ ఒకరు. ఉస్మానియా యూనివర్సిటీలో 1984లో బీఈ (మైనింగ్) చేసిన ప్రసాద్ ధన్బాద్లో ఎంటెక్ (ఓపెన్‌కాస్ట్ మైనింగ్) పూర్తిచేశారు. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, మహానది కోల్‌ఫీల్డ్స్ తదితర సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2015 నుంచి కొద్ది సంవత్సరాలు ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మైనింగ్)గా కూడా వ్యవహరించారు.