Satya Nadella – Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులతో మైక్రోసాఫ్ట్ సేవలను విస్తరించాలన్న ప్రణాళికలను సత్య నాదెళ్ల వెల్లడించినందుకు ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. సత్య నాదెళ్లతో భేటీ తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘నేను మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణ ప్రణాళికలు వెల్లడించినందుకు ధన్యవాదాలు. మన సమావేశంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై అద్భుతమైన చర్చలు జరిగాయి’ అని పేర్కొన్నారు.
సత్య నాదెళ్ల తన మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ‘ఇండియా -ఏఐ ఫస్ట్’గా తీర్చిదిద్దడానికి కలిసి పని చేయాలని ఆసక్తితో ఉన్నా. ఏఐ ప్లాట్ ఫామ్ దిశగా షిఫ్ట్ కావడంతో ప్రతి భారతీయుడికి లబ్ధి చేకూరాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు. సత్య నాదెళ్ల తన పర్యటనలో భాగంగా బెంగళూరు, ఢిల్లీల్లోని మైక్రోసాఫ్ట్ క్లయింట్లు, ఇతర వాటాదారులను ఉద్దేశించి మాట్లాడతారు. గతేడాది ఫిబ్రవరిలో చివరిసారిగా భారత్‌లో సత్య నాదెళ్ల పర్యటించారు.