న్యూఢిల్లీ, నవంబర్ 12: పెట్టుబడిదారులు, కస్టమర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రెండు సరికొత్త పథకాలను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ స్కీం, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీంలను పరిచయం చేశారు. ఇందులో ఒకటి ఆర్థిక వ్యవస్థలో అందర్నీ భాగస్వాములుగా చేయాలన్న, అందరికీ ఆర్థిక సేవల్ని అందుబాటులోకి తేవాలన్న ఆశయాన్ని బలోపేతం చేసేదైతే, మరొకటి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరిచేది. సెక్యూరిటీ మార్కెట్లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీం ఓ గొప్ప మైలురాయిగా మోదీ ఈ సందర్భంగా అభివర్ణించారు.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీంతో ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లో చిన్న రిటైల్ ఇన్వెస్టర్లకూ పెద్ద ఎత్తున పెట్టుబడి అవకాశాలు లభిస్తాయన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మోదీ వ్యక్తం చేశారు. అందరూ సులభంగా క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశించే వీలుంటుందన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, వేతనజీవులు, చిరు వ్యాపారులు, వృద్ధులు తమ స్మాల్ సేవింగ్స్‌ను నేరుగా, భద్రంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుకోవచ్చన్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీంతో మొత్తం ఆర్థిక రంగం కోసం ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్ వ్యవస్థ వస్తుందన్నారు. ప్రభావవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాగం ఏర్పాటుతో కస్టమర్లకు కొత్త ఉత్సాహం రాగలదన్నారు.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీంతో ఇక ఎవరైనా ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల నుంచి నేరుగా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ), ప్రభుత్వ అభివృద్ధి రుణాల (ఎస్డీఎల్)ను కొనుగోలు చేయవచ్చు. సేవింగ్స్ ఖాతా నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించాలి. సందేహాల కోసం ఇన్వెస్టర్లు 1800-267-7955 నంబర్‌కు (ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే పనిచేస్తుంది) కాల్ చేయవచ్చు. ఈ-మెయిల్ కూడా చేసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఎలాంటి చార్జీల్లేకుండా ఇన్వెస్టర్లు తమ ట్రాన్జాక్షన్, బ్యాలెన్స్ స్టేట్మెంట్లు, నామినేషన్ ఫెసిలిటి, సెక్యూరిటీల తాకట్టు, గిఫ్ట్ ట్రాన్జాక్షన్ల వివరాలను పొందవచ్చు.
ఆర్బీఐ సహకారంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా)ను తెరిచే సదుపాయం ఈ స్కీం కల్పిస్తున్నది. ఈ ఖాతాను కస్టమర్లు తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకోవచ్చు. ఎన్డీఎస్-ఓఎం ద్వారా సెకండరీ మార్కెట్ కార్యకలాపాల్లో, ప్రభుత్వ బాండ్ల జారీల్లో ఆర్డీజీ ఖాతాదారులు పాల్గొనవచ్చు. ఎన్డీఎస్-ఓఎం అనేది ఓ స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ రహస్య ఆదేశ అనుసంధాన వ్యవస్థ. ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కోసం ఆర్బీఐ దీన్ని నిర్వహిస్తున్నది. ఇప్పటిదాకా బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థలకే దీన్ని తెరిచే వీలున్నది. తాజా స్కీంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది.
రిటైల్ డైరెక్ట్ స్కీంతో బాండ్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు మరింతగా పెరుగుతారు. గతంలో ఎదురైన సమస్యలు ఇకపై ఉండవు. సౌకర్యవంతంగా, వ్యయ రహితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టవచ్చు’ -నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
‘రిటైల్ డైరెక్ట్ స్కీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లలో నేరుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇన్వెస్టర్లు ఉచితంగా ఆర్బీఐ సహకారంతో ఆన్లైన్లో ప్రభుత్వ సెక్యూరిటీల ఖాతాలను తెరుచుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్