హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం సంస్థ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని కలుసుకొని భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికను వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో 15 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో ‘బన్యన్ నేషన్’ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్నది.
ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 45 వేల టన్నులకు విస్తరించడానికి నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. ఈ విస్తరణ పూర్తయితే మరో 500 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి వెల్లడించారు. రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌ను ఈ సంస్థ యూనీలివర్, టాటా మోటార్స్ లాంటి పెద్ద కంపెనీలకు విక్రయిస్తుందని మంత్రి తెలిపారు. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన బన్యన్ నేషన్ లాభాల్లో నడుస్తున్నదని, కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం వారు మరికొంత భూమిని అడుగుతున్నారని, దీనిపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.