Rent Payment | క్రెడిట్ కార్డు యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారీ షాక్ తగిలింది. భారత్‌లోని ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీలైన ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్ సహా పలు యాప్‌లలో క్రెడిట్ కార్డు రెంట్ పేమెంట్స్ సర్వీస్‌ను నిలిపివేశాయి. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో సర్వీసులను నిలిపివేశాయి. సెప్టెంబర్ 15న ఆర్బీఐ జారీ చేసిన పేమెంట్ అగ్రిగేటర్ (PA), పేమెంట్ గేట్‌వే (PG) మార్గదర్శకాల మేరకు ఆయా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నది. ఆయా నిబంధనలు ఆర్బీఐ కఠినతరం చేసింది. ఆయా సంస్థలతో నేరుగా సంబంధం లేని సంస్థలకు చెల్లింపులను సులభతరం చేయకూడదంటూ మార్గదర్శకాల్లో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన మర్చంట్స్‌కు మాత్రమే చెల్లింపుల ప్రాసెస్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. రెంట్ పేమెంట్స్ విషయంలో ఎవరూ రిజిస్టర్డ్ వ్యాపారులు కాకపోవడంతో ఆయా కంపెనీలు రెంట్పేమెంట్స్ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి చాలామంది క్రెడిట్ కార్డు యూజర్లు రెంట్ ఆప్షన్‌తో డబ్బులను ఖాతాలకు మళ్లించి వాడుకునే విషయం తెలిసిందే. దాంతో వారందరికీ ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వాస్తవానికి ఫిట్టెక్ కంపెనీలు అందిస్తున్న రెంట్ సేవలను ఉపయోగించుకొని చాలామంది డబ్బులను బ్యాంకులకు మళ్లిస్తున్నట్లుగా ఇప్పటికే చాలా బ్యాంకులు గుర్తించాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ జూన్ 26న క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు పంపిన ఈ మెయిల్లో ఫిన్‌టెక్ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపులపై ప్రతి లావాదేవీకి రూ.3వేల నుంచి ఒకశాతం వరకు రుసుమును విధించనున్నట్లు తెలిపింది. అంతకుముందు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ రెంట్ పేమెంట్స్‌పై రివార్డ్ పాయింట్లను నిలిపివేశాయి. మార్చి 2024 నుంచి ఫోన్‌పే, పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్, అమెజాన్ పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్‌కార్డుల ద్వారా అద్దె చెల్లింపుల స్వీకరణను నిలిపివేశాయి. అయితే, కొన్ని వినియోగదారులకు మరిన్ని కేవైసీని చేయడంతో తిరిగి రెంట్ పేమెంట్ చేసే అవకాశం కల్పించాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగించి భారీగా అద్దె చెల్లింపులు చేస్తుండడంతో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఇకపై ఆయా యాప్‌లను ఉపయోగించి రెంట్ పేమెంట్స్ అవకాశం ఉండదు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులుపడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఎదురైంది.