Crisil Report | వెజ్, నాన్ వెజ్ థాలీ ధరల్లో ఘననీయమైన తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు మాసంలో వెజ్ థాలీ ధరల్లో 7 శాతం, నాన్ వెజ్ థాలీ ధరల్లో 8శాతం తగ్గిందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజా రోటీ రైస్ నివేదిక వెల్లడించింది. ఉల్లిపాయ, బంగాళాదుంప, పప్పుధాన్యాల ధరలు గణనీయంగా తగ్గడం వల్ల శాఖాహార థాలీ ధరలు తగ్గుముఖం పట్టినట్లుగా నివేదిక పేర్కొంది. బంగాళాదుంపలు 31శాతం, ఉల్లిపాయల ధరలు వరుసగా 37శాతం తగ్గాయి. బంగాళాదుంప ఉత్పత్తి సవాళ్లను ప్రస్తావిస్తూ.. ఏడాది కిందట బంగాళదుంప ఉత్పత్తి 5 నుంచి 7 శాతం తగ్గాయని.. ఫలితంగా ధర పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఈ సంవత్సరం ఉత్పత్తి 3 నుంచి 5శాతం పెరుగుతుందని అంచనా. నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం ఉల్లిపాయల వార్షిక ఉత్పత్తిలో 18-20శాతం పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
పప్పుధాన్యాల ధరలు సంవత్సరానికి 14శాతం తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే అధిక ఉత్పత్తి, పెరిగిన స్టాక్ లెవల్స్ కారణంగా ఇది సాధ్యమైందని నివేదిక వెల్లడించింది. పండుగ సీజన్ ప్రారంభంలో డిమాండ్ పెరగడంతో కూరగాయల నూనె ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 24శాతం పెరిగాయి. అయితే, ఎల్పీజీ సిలిండర్ ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 6శాతం పెరిగాయి. ఈ క్రమంలో వెజ్ థాలీ ధరల్లో తగ్గుదల పరిమితంగా ఉందని క్రిసిల్ పేర్కొంది. ఇక మాంసాహార థాలీ ధర తగ్గడానికి కారణం బ్రాయిలర్ చికెన్ ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 10శాతం తగ్గమే కారణమని చెప్పింది. నాన్వెజ్ థాలీ ధరలో వాటి ధరే 50శాతం వాటా కలిగి ఉందని.. కూరగాయల, పప్పుధాన్యాల ధరలు తగ్గడం కూడా కారణమని నివేదిక తెలిపింది.
అయితే, నెలవారీ ప్రాతిపదికన ఆగస్టులో శాఖాహారం, మాంసాహార థాలీ ధరలు వరుసగా 4శాతం, 2శాతం పెరిగాయి. శ్రావణ మాసం ముగింపు తర్వాత డిమాండ్ పెరిగినప్పటికీ.. బ్రాయిలర్స్ సరఫరా ఎక్కువగా ఉండడంతో థాలీ ధరల పెరుగుదల పరిమితంగా ఉందని నివేదిక పేర్కొంది. ఇది నెలవారీ ప్రాతిపదికన ధరల్లో స్థిరత్వం ఉందని చెప్పింది. వినియోగదారుల ధరల సూచిక (CPI).. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూలై 2025లో వార్షిక ప్రాతిపదికన 1.55 శాతానికి తగ్గింది. జూన్ 2017 తర్వాత అత్యల్ప స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం.. జూన్లో 1.01 శాతంతో పోలిస్తే జూలైలో -1.76 శాతానికి తగ్గింది. జనవరి 2019 తర్వాత ఇది అత్యల్ప స్థాయి ఆహార ద్రవ్యోల్బణం. పప్పుధాన్యాలు, ఉత్పత్తులు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, చక్కెర, స్వీట్లు.. అలాగే రవాణా, కమ్యూనికేషన్ సేవల ధరలలో విస్తృత స్థాయిలో తగ్గుదల కారణంగా ధరలు తగ్గాయి. ఆగస్టు నెలకు రిటైల్ ద్రవ్యోల్బణ డేటా శుక్రవారం విడుదల కానుంది.