Credit Cards | పలు ఆర్థిక నిర్ణయాలకు వేదికగా 2022 నిలిచింది. డిజిటల్ పేమెంట్స్‌కు సేఫ్టీ కోసం డిజిటలైజేషన్, క్రెడిట్ కార్డుల వాడకంపై గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ. రెంటల్ పేమెంట్స్ చేస్తున్న క్రెడిట్ కార్డుల యూజర్లపై పలు బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆ జాబితాలో ఎస్బీఐ కార్డు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచాయి. సర్వీస్ చార్జీతోపాలు ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డుల వాడకంపై వడ్డీ చెల్లింపునకు ఈ రెంటల్ సర్వీస్ చార్జీ అదనం. ఆయా క్రెడిట్ కార్డులపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఫీజులు, సర్వీస్ చార్జీలపై ఓ లుక్కేద్దాం.. !
క్రెడిట్ కార్డు వినియోగించి రెంటల్స్ పే చేస్తున్న యూజర్లకు ఎస్బీఐ కార్డు షాక్ ఇచ్చింది. 18 శాతం వడ్డీతోపాటు రూ.99 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తున్నది. ఈ రెంటల్ పేమెంట్స్‌పై సర్వీస్ చార్జీ 2022 నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఉదాహరణకు నెలకు రూ.12,000 పే చేస్తే ప్రాసెసింగ్ ఫీజుగా రూ.99తోపాటు అదనంగా జీఎస్టీగా రూ.17.82 పే చేయాల్సి ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు జరిపే రెంటల్ పేమెంట్స్ మీద ఒకశాతం సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్నది. గత అక్టోబర్ 20 నుంచి రెంటల్ పేమెంట్స్‌పై సర్వీస్ చార్జీ అమల్లోకి వచ్చింది.
మరో ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా రెంట్ పేమెంట్స్‌పై సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్న జాబితాలో చేరింది. థర్డ్ పార్టీ మర్చంట్ల ద్వారా జరిపే రెంటల్ పేమెంట్స్ మీద ఒకశాతం ఫీజు వసూలు చేస్తున్నది. క్రెడిట్ కార్డు ఉపయోగించి క్రెడ్, పేటీఎం, మేగేట్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రెంటల్స్ పే చేస్తే 1-17.5 శాతం సర్వీస్ ఫీజు వసూలు చేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా రెంటల్ పేమెంట్స్ జరిపితే మొత్తం లావాదేవీపై ఒకశాతం సర్వీస్ చార్జీ వసూలు చేయనున్నది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది. ఉదాహరణకు మీరు రూ.10 వేల వరకు రెంట్ పే చేస్తే సర్వీస్ చార్జీగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా జీఎస్టీ, వడ్డీరేటు, ఇతర చార్జీలు వసూలు చేస్తుంది.